Pensioners fires on ys jaganపెన్షన్ల విషయంలో జగన్ ప్రభుత్వం తప్పటడుగు వేసిందనే చెప్పుకోవాలి. ప్రచారం అంతటా పెన్షన్లు మూడు వేలకు పెంచుతామని చెప్పి ఆ తరువాత మేము 3000 వేలకు పెంచుకుంటూ పోతాం అని చెప్పి మాటల గారడీకి దిగారు. కొన్ని కంపెనీలు షరతులు వర్తిస్తాయని ఇచ్చే మోసపూరిత ప్రకటనల మాదిరిగా ఇది ఉందని సోషల్ మీడియాలో చాలా మంది విమర్శిస్తున్నారు. అయితే మేము పెంచుకుంటూ పోతాం అని చెప్పాం అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు కవర్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా పెన్షన్ 250 పెంచి 2250 రూపాయిలు చేస్తున్నా అని ఇది జూన్ 1 నుండి అమలు లోకి వస్తుందని జగన్ తన మొదటి సంతకం సమయంలో ప్రకటించారు. అయితే అది కూడా జరగలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి పెన్షన్ల పంపకం జరుగుతుంది. రెండు మూడు రోజులలో ఈ ప్రక్రియ పూర్తి అవుతుంది. అయితే అర్హులకు ఇప్పటికీ 2000 రూపాయిలే ఇస్తున్నారు. దీనితో పెన్షన్ దారులు చాలా నిరాశపడుతున్నారు. కటింగ్ లో మళ్ళీ కటింగ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోవడం వల్ల తప్పట్లేదు అని ప్రభుత్వం చెప్పుకొస్తున్నా ప్రజలు వాటిని పట్టించుకునే పరిస్థితి ఎక్కువ కాలం ఉండదు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్ని డిపార్టుమెంట్ల ముఖ్యాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆర్ధిక వనరులు పెంచుకునే మార్గాలు అన్వేషించాలని జగన్ అధికారులకు సూచించారు. ఈ నెల 8న జగన్ తన కేబినెట్ ను విస్తరించనున్నారు. ఇప్పటికే కేబినెట్ కూర్పుపై ఆయన కసరత్తు చేస్తున్నారు.