Penmetsa Vishnu Kumar Raju - YS Jaganప్రభుత్వ విధానాలను విమర్శించినందుకు ఎంపీ పై ఏకంగా దేశద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేయించి, ఆ తరువాత థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా విమర్శిస్తున్నాయి. బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు ఈ విషయంగా జగన్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు కుప్పించారు.

“న్యాయవ్యవస్థ ను అస్థిరపరచడానికి న్యాయమూర్తులను ముక్కలు ముక్కలుగా నరికేయ్యండి అని అనడం ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కదా? జగన్ మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రిని ఉరి తియ్యాలి అనడం ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కదా? మీరు చేసినదానికంటే రఘురామ కృష్ణం రాజుగారు చేసింది ఎక్కువేమీ కాదు కదా?,” అని ఆయన అడిగారు.

“ఇది నియంత ప్రభుత్వమైతే చెప్పండి అంతా నోరుమూసుకుని ఉంటాం. మీరు రెండు సంవత్సరాల నుండి మీ ప్యాలస్ దాటి బయటకు రారు. ఎవరినీ లోపలకు రానివ్వరు. ఎవరికీ అప్పోయింట్మెంట్ కూడా ఇవ్వరు. మీ సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు చేప్పేది అయినా వినండి. ఇదో వింత ప్రభుత్వం… వింత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి,” అని ఆయన విమర్శించారు.

ఈ విషయంగా రఘురామ రాజుకు బీజేపీ నాయకులకు మద్దతు ఇస్తున్నారు. ఎంపీ కుమారుడు భరత్ తన తండ్రిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపుపై అలాగే పోలీసుల దాష్టీకంపై కేంద్ర హోమ్ శాఖకు కంప్లయింట్ చేస్తూ ఒక లేఖ రాశారు. అయితే ఇప్పటి వరకు దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.