peddireddy ramchandrareddy power cuts issueప్రభుత్వం ప్రజలకు ఏదైనా మేలు చేస్తే అది శుభవార్త అని గొప్పగా చెప్పుకోవడం సహజం. కానీ పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ప్రకటించి, దానిని ఎత్తేస్తున్నట్లు చెప్పి మళ్ళీ ప్రతీరోజు కొన్ని గంటలు మాత్రమే నడిపించుకోవచ్చునని మంత్రిగారు చెప్తే అదీ శుభవార్తే అని గొప్పలు చెప్పుకోవడం వైసీపీ నేతలకు సాక్షికే చెల్లు.

రాష్ట్ర ఇందన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “ఏప్రిల్ 8 నుంచి రాష్ట్రంలో పరిశ్రమలకు అమలవుతున పవర్ హాలీడేస్ ఎత్తివేస్తున్నాము. కానీ 24 గంటలు విద్యుత్‌ వినియోగించుకొనే పరిశ్రమలు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 70 శాతం విద్యుత్‌ వినియోగించుకోవచ్చు. మిగిలిన సమయంలో 50 శాతం విద్యుత్‌ వినియోగించుకోవచ్చు.

ఇక పగలు మాత్రమే పనిచేసే పరిశ్రమలకు ఒకరోజు పవర్ హాలీడేను ఎత్తేశాము. కానీ సాయంత్రం 6 గంటల వరకు రోజుకి ఒక్క షిఫ్ట్ చొప్పున మాత్రమే పరిశ్రమలను నడిపించుకోవచ్చు,” అని చెప్పారు.

నేటికీ పరిశ్రమలకు ఈవిదంగా విద్యుత్‌ కోతలు విధిస్తూనే ‘పవర్ హాలీడేస్ ఎత్తేశాము…పండగ చేసుకోండి’ అని చెప్పడం గొప్పే కదా?

విద్యుత్‌ కోతలు లేకుండా నిరంతరంగా విద్యుత్‌ సరఫరా జరిగినంతకాలం అది మా గొప్పే అని భుజాలు చరుచుకొన్న వైసీపీ నేతలు, కొరత ఏర్పడినప్పుడు ‘దేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ సమస్య ఉంది కనుక విద్యుత్‌ కోతలు మా ప్రభుత్వం అసమర్ధత కాదన్నట్లు’ మాట్లాడుతుండటం విశేషం.

ఒక పెద్ద సమస్యను కొంత తగ్గించగలిగితే అదీ గొప్ప విషయమే అవుతుందా?తెలంగాణ ప్రభుత్వంలాగా ఏపీ ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం 24 గంటలు విద్యుత్‌ ఇస్తే చాలు వాటి తిప్పలు అవే పడతాయి కదా?ఉన్న పరిశ్రమలకే నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయలేనప్పుడు ఇక రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు రమ్మంటే వస్తాయా?