peddireddi ramachandra reddy  says 33 capitals for andhra pradeshరాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల మాటలు వివాదాలను పెంచేవిగా ఉన్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మూడు కాకపోతే ముప్పై మూడు రాజధానులు పెట్టుకుంటామని, అమరావతిలో టీడీపీ కార్యకర్తలే ఆందోళనలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

అమరావతిలో రైతుల భూములను వెనక్కి ఇచ్చేస్తామని తెలిపారు. రాజధానిలో భూములు వెనక్కి ఇస్తామని ఎన్నికల ముందే జగన్‌ చెప్పారని వెల్లడించారు. సచివాలయం తాత్కాలికమని చంద్రబాబే చెప్పారని, ఇప్పుడు తరలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ ప్రతిపాదనకు కేంద్రం సహకరిస్తుందా అనేదాని పై కూడా ఆయన ఘాటుగా స్పందించారు.

రాజధానులకు కేంద్రం అనుమతులు, నిధులు అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై రాజధాని ప్రాంత రైతులు మండిపడుతున్నారు. భూములు ఎలా తీసుకున్నారో అలాగే అప్పగించాలని డిమాండ్ చేశారు. మా భూముల్లో భవనాలు, రహదారులు, కాల్వలు నిర్మించి ఇప్పుడు వెనక్కి ఇచ్చేస్తామంటే ఎలా? అని ప్రశ్నించారు.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మహా ధర్నాలో పాల్గొన్నారు రైతులు. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు ఎక్కడ దాక్కున్నారంటూ మండిపడ్డ్డారు. మా దీక్షకు ఇతర ప్రాంతాల నేతలు, సంఘాలు మద్దతిస్తున్నా.. స్థానిక నేతలు మాత్రం బయటకు రావడం లేదని ఆరోపించారు. కేంద్రమే తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తున్నారు.