peddireddi ramachandra reddy denies chamber used by nara lokeshరాజకీయాలలో సెంటిమెంట్లు అనేవి చాలా సహజం. కొన్ని చాలా సిల్లీగా ఉన్నా ఎవరి నమ్మకాలు వారివి. అయితే అటువంటి ఒక సెంటిమెంట్ గురించి ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. వైఎస్ జగన్ కేబినెట్‌లో పంచాయతీరాజ్, మైనింగ్ శాఖలను దక్కించుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సచివాలయంలోని 5వ బ్లాక్‌లోని ఛాంబర్‌ను కేటాయించారు. గతంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించిన టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ ఈ ఛాంబర్‌ను వినియోగించారు.

అయితే ఈ ఛాంబర్ నుండి పని చేసిన లోకేష్ ఎన్నికలలో ఓడిపోయి ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు అయోమయంగా ఉంది. ఈ కారణంగా పెద్దిరెడ్డి గారికి ఆ ఛాంబర్ అవసరం లేదంట. అంత పెద్ద ఛాంబర్ నాకు వద్దు అంటూ వినమ్రంగా చెప్పుకొచ్చారు మంత్రిగారు. ముఖ్యమంత్రికి బాగా దగ్గరైన మంత్రి కావడంతో ఇక అడ్డేముంది. తొలుత మూడో బ్లాక్‌లో ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణికి కేటాయించిన రూం నెంబర్‌ 203ను ఆమెకు రద్దుచేసి, ఆ ఛాంబర్‌ను పెద్దిరెడ్డికి ఇచ్చేశారు.

అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డికి కేటాయించిన ఐదో బ్లాక్‌లో రూం నెంబర్‌ 188ను ఇప్పుడు పుష్పశ్రీవాణికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. పాపం మీకు కలిసి రానిది, అక్కర్లేదు అనుకున్నది ఎస్టీ మహిళా ఎమ్మెల్యేకు అంటగడతారా అని విమర్శలు వస్తున్నాయి. ఛాంబర్ విషయంలో పుష్పశ్రీవాణికి తన అనుమానాలు తనకు ఉన్నా జూనియర్ కావడంతో పైకి మాట్లాడకుండా పని చేసుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి ఛాంబర్ తరువాత విశాలమైనది, ఆధునిక హంగులు ఉన్న ఛాంబర్ ఇదే కావడం విశేషం.