payyavula_TDP_MLAపబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్‌గా ఉన్న టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు కేటాయించిన ఇద్దరు గన్‌మ్యాన్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై నిన్న మీడియా, సోషల్ మీడియాలో వార్తలు, విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టినందుకే పయ్యావులకు జగన్ ప్రభుత్వం భద్రతను ఉపసంహరించిందని విమర్శలు వచ్చాయి.

వాటిపై నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా తనదైన శైలిలో స్పందిస్తూ, “మా వైసీపీ ప్రభుత్వం ఏమి చేసినా దానికో పరమార్ధం ఉంటుంది. పయ్యావుల గన్‌మ్యాన్‌ల తొలగింపు కూడా అటువంటిదే. ఆయన మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కనుక ఆయనపై కూడా నిఘా పెట్టాలని భావించి ఉండవచ్చు. కనుక గన్‌మ్యాన్‌లను ఉపసంహరించి వారి స్థానంలో తన గూఢచారులను ఏర్పాటు చేసినా ఆశ్చర్యపోనక్కరలేదు,” అని అన్నారు.

ఆయన చెప్పినట్లుగానే పాత గన్‌మ్యాన్‌ స్థానంలో ఒక కొత్త గన్‌ మ్యాన్‌ విధులలో చేరేందుకు హైదరాబాద్‌లో ఉన్న తన వద్దకు వచ్చినట్లు పయ్యావుల దృవీకరించారు. “ప్రభుత్వం నా గన్‌మ్యాన్‌ను హటాత్తుగా ఎందుకు ఉపసంహరించుకొన్నారో, వారి స్థానంలో కొత్త గన్‌మ్యాన్‌ను ఎందుకు పంపించిందో నాకు తెలియదు. పాత గన్‌మ్యాన్‌ స్థానంలో కొత్త గన్‌మ్యాన్‌ను నియమించినట్లు నాకు పోలీస్ శాఖ నుంచి ఎటువంటి సమాచారం రాలేదు. కనుక నా వద్దకు వచ్చిన వ్యక్తి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్‌మ్యానో కాదో నాకు తెలియనందున అతనిని వెనక్కు తిప్పి పంపాను,” అని పయ్యావుల తెలిపారు.

మీడియాలో వస్తున్న వార్తలపై అనంతపురం ఎస్పీ ఫకీరప్ప స్పందిస్తూ, “పయ్యావుల కేశవ్‌కు భద్రత ఉపసంహరించామని మీడియాలో వస్తున్న వార్తలలో నిజం లేదు. ఆయనకు భద్రత తొలగించలేదు. గన్‌మ్యాన్‌లను మార్చాము అంతే. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ వలన ఇటువంటి అపోహలు ఏర్పడ్డాయి,” అని వివరణ ఇచ్చారు.

అధికార, ప్రతిపక్ష రాజకీయనేతలకు గన్‌మ్యాన్‌ ఏర్పాటు చేయడం, అప్పుడప్పుడు వారిని మార్చుతుండటం సాధారణ ప్రక్రియే. కానీ ఇటీవల పయ్యావుల కేశవ్ జగన్ ప్రభుత్వ విధానాలపై నిశితంగా విమర్శించగానే ఈ మార్పు జరగడం, అదీ… ఆయనకు ముందుగా తెలియజేయకుండా జరగడమే అనుమానాలకు తావిస్తోంది. పైగా సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజునే వేధిస్తున్న వైసీపీ ప్రభుత్వం, తమను విమర్శిస్తున్న ప్రతిపక్ష నేతలను ఉపేక్షిస్తుందా? కనుక పయ్యావుల గన్‌మ్యాన్‌ తొలగింపు, మార్పు వ్యవహారంపై ఇంకా అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.