Payyavula Keshavఆంధ్రప్రదేశ్‌ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలలో నేడు టిడిపి సభ్యులు పైయ్యావుల కేశవ్‌, నిమ్మల రామానాయుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో ఎమ్మెల్యేలందరినీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ సమావేశాలు ముగిసేవరకు సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగనీయకుండా పదేపదే అడ్డుపడుతున్నందున సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పారు.

అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం గురించి నిలదీయగా, పయ్యావుల కేశవ్ దిశ చట్టం గురించి గవర్నర్‌ చేత ప్రభుత్వం అబద్దం చెప్పించిందని, రాజ్యాంగ నిబందనల ప్రకారం గవర్నర్‌ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి, స్పీకర్ తదితరులు ఎదురేగి తోడ్కొని రావలసి ఉండగా ఆయనను స్పీకర్ ఛాంబర్‌లో 5 నిమిషాల సేపు వేచిచూసేలా చేసి అవమానించారని ఆరోపించారు. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కాకి లెక్కలు, కట్టు కధలు చెప్పడంలో దిట్ట అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన దిశ చట్టానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపనప్పుడు రాష్ట్రంలో దిశ చట్టం అమలులో ఉందని గవర్నర్‌ చేత ఎలా చెప్పించారని, ఇది సభను, ప్రజలను చివరికి గవర్నర్‌ను తప్పు దోవ పట్టించడం కాదా?అని పయ్యావుల నిలదీశారు.

ఇక కొండపి టిడిపి ఎమ్మెల్యే డోల శ్రీ బాల వీరాంజనేయులు మంత్రి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గాలి తీసేశారు. పాఠశాలల విలీనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది పాఠశాలలు మూసివేసి గ్రామాలలో పిల్లలకు విద్యను దూరం చేశారని ఆరోపించారు. చాలా గ్రామాలకు కిలోమీటర్ కంటే ఎక్కువ దూరంలోనే విలీన పాఠశాలాలూ ఉన్నందున అనేకమంది పిల్లలు చదువుకు దూరం అయ్యారని, విద్యార్ధుల సంఖ్య గణనీయంగా తగ్గిందని మీ విద్యాశాఖ కమీషనర్ చెపుతుంటే, మంత్రిగారు వేరేలా చెపుతున్నారేమిటి?అని నిలదీశారు. అసలు మంత్రిగారికి, అధికారులకు మద్య ఇంత కమ్యూనికేషన్ గ్యాప్‌ ఉంటే విద్యాశాఖ ఇంతకంటే గొప్పగా ఎలా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఓ పక్క ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేస్తూ, మరోపక్క మూసివేసిన వాటిపై వందల కోట్లు ఖర్చులు పెట్టి ఎందుకు నగిషీలు చెక్కిస్తున్నారని ప్రశ్నించారు. సబ్జెక్ట్ టీచర్ల పోస్టులు వేలాదిగా ఖాళీ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు.

అచ్చన్నాయుడు కూడా ప్రభుత్వం తీరుని నిశితంగా విమర్శిస్తుంటే ఆయన మాటలు వినిపించనీయకుండా వైసీపీ సభ్యులు అభ్యంతరం చెపుతూ పెద్దగా అరుస్తూ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. టిడిపి సభ్యులు అందరూ ఈవిదంగా మంచి అవగాహనతో, సాధికారతతో మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే మంత్రులకు జవాబులు చెప్పడం కష్టం అయ్యింది. టిడిపి సభ్యుల ప్రశ్నలకు జవాబులు చెప్పుకోవడం కంటే ఏదో వంకతో సభ నుంచి సస్పెండ్ చేసి బయటకు పంపించేస్తే ఆ తర్వాత హాయిగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ తమ ప్రభుత్వం గురించి డప్పు కొట్టుకోవచ్చని అనుకొన్నట్లున్నారు. మొత్తం అందరినీ శాసనసభ సమావేశాలు ముగిసేవరకు సస్పెండ్ చేసి బయటకు పంపించేశారు. ఆ తర్వాత సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం 11.28 శాతం ఆర్ధికవృద్ధి రేటు సాధించిందని, దేశానికే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోంది అని చెప్పుకొని ఇదే నా ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ అని ముగించారు.