PawanKalyan Meeting with Amaravati Farmers, Mangalagiri.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాజధాని రైతులు పవన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ…అమరావతి నుంచి రాజధాని కదిలేదిలేదు, కదిలించాలని ప్రయత్నిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన.

ఆడపడుచులు రోడ్డుపైకి వచ్చి పోరాడుతుంటే పాశవికంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపడుచులపై పోలీసుల దాడిని మర్చిపోనని పవన్‌ హెచ్చరించారు. దివ్యాంగులన్న కనికరం కూడా లేకుండా లాఠీచార్జ్‌ చేశారని, ఒళ్లంతా మదమెక్కితేనే ఇలాంటి పనులు చేస్తారని జనసేనాని వ్యాఖ్యానించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ వ్యక్తిత్వం, రౌడీ సంస్కృతి, ఫ్యాక్షనిస్టు సంస్కృతి అని… ప్రజలపై చూపుతారని మొదటి నుంచీ చెబుతున్నానని పవన్‌ గుర్తుచేశారు. “జగన్ రెడ్డి గారూ.. మీకు ఒక్కటే చెబుతున్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు” అని పవన్‌ హెచ్చరించారు. ఒక సామాజికవర్గం అని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్న నెపంతో.. ఇన్ని కులాలను, ఇంత మందిని క్షోభపెట్టారని పవన్‌ మండిపడ్డారు.

వైఎస్సార్ కాంగ్రెస్ వినాశనం మొదలైందని, భవిష్యత్‌లో ఆ పార్టీ ఉండకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఇది ఇలా ఉండగా బీజేపీ పెద్దలతో సమావేశం కావడానికి పవన్ కళ్యాణ్ రేపు ఢిల్లీ వెళ్లే ముందు ఈ వ్యాఖ్యలు చెయ్యడం ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం సాయంత్రం ఢిల్లీలో బీజేపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి పవన్ హాజరుకానున్నారు.