దాదాపుగా మూడు నెలల విరామం తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ సందడి నెలకొంది. షూటింగ్లు మొదలయ్యాయి. తెలంగాణ లో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తెయ్యడంతో సోమవారం నుండి పూర్తి స్థాయి ఆక్టివిటీ మొదలు కానుంది. స్టార్లు కూడా అతితొందరలోనే షూటింగ్లు మొదలుపెట్టడానికి సిద్ధం అవుతున్నారు.
పవన్ కళ్యాణ్ కు ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఒకటి అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్… ఇంకోటి హరి హర వీరమల్లు. అయితే ఈ రెండు సినిమాలలో పవన్ ఫస్ట్ ప్రిఫెరెన్స్ అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ అని తేల్చి చెప్పేశాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల 11 నుండి హైదరాబాద్ లో మొదలుకాబోతుంది.
దీనికోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్ వేశారు నిర్మాతలు. ఈ సినిమా మొదట్లో సెప్టెంబర్ లో వినాయక చవితి సందర్భంగా విడుదల చెయ్యాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు పరిణామాల దృష్ట్యా సాధ్యపడకపోవచ్చు. ఇక హరి హర వీరమల్లు వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ కాబట్టి ముందు అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ మొదలుపెట్టబోతున్నారు పవన్.
అయితే హరి హర వీరమల్లు ఇప్పటికే చాలా కాలంగా షూటింగ్ దశలోనే ఉండిపోయింది. నిర్మాత ఏఎం రత్నం కు చాలా కాలంగా హిట్ అనేది లేదు… దానితో ఈ సినిమా మీద చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే అనేక కారణాల వల్ల ఈ సినిమా వాయిదా పడటం ఆయనకు మింగుడుపడటం లేదు.