Pawan Kalyanదిశ రేప్ మర్డర్ కేసుపై దేశం అట్టుడికిపోతున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ తరువాత జరిగిన ఎన్‌కౌంటర్‌ పై చేసినట్టుగా చెప్పిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. రేప్ చేసిన వారిని ఉరి తీయడం కాదని బెత్తంతో రెండు దెబ్బలు వెయ్యాలి పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కొన్ని మీడియా సంస్థలు చెప్పుకొచ్చాయి (మిర్చి9 కాదు).

దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా పవన్ కళ్యాణ్ దీనిపై వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను సాక్షి, నాని బ్రదర్స్ (కొడాలి నాని, పేర్ని నాని) వక్రీకరించారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. “నేను ఆరోజు చెప్పింది రేప్ తరువాత చేయాల్సింది కాదు. సింగపూర్ వంటి దేశాలలో మహిళలతో తప్పు గా ప్రవర్తిస్తే కేనింగ్ అని చేస్తారు. కేనింగ్ అంటే చిన్నప్పుడు కొట్టే బెత్తాలు కాదు. వాటితో కొడితే తోలు ఊడిపోతుంది,” అంటూ పవన్ కళ్యాణ్ వివరించారు.

“వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రులు అంతా ఇంగ్లీష్ దొరలు. పాపం వారికి తెలుగు రాదు. అర్ధం కాదు. తర్జుమా చేసి అర్ధం చేసుకునేసరికి అర్ధం మారిపోతుంది. అందుకే మాతృభాషను మనం అందరం కాపాడుకోవాలి అనేది,” అని పవన్ కళ్యాణ్ చమత్కరించారు. ఇది ఇలా ఉండగా దిశ కేసులోని ఎన్‌కౌంటర్‌ పై దర్యాప్తు చెయ్యడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.

మరోవైపు దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ బృందం విచారణ చేస్తుంది. నిన్న చనిపోయిన కుటుంబాల వారితో కూడా మాట్లాడింది. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఏమైనా అనుమానాలున్నాయా అంటూ పదే పదే అడిగి తెలుసుకున్నారు. నిందితుల వ్యక్తిగత వివరాలపై కూడా ఆరా తీశారు. ‘కోర్టు 14 రోజుల గడువు ఇచ్చింది కదా.. అలాంటప్పుడు ఎందుకు ఎన్‌కౌంటర్‌ చేశారని’ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యులను నిందితుల కుటుంబసభ్యులు అడిగినట్లు సమాచారం. తమ బిడ్డలను కనీసం చివరి చూపు కూడా చూపలేదని వారు వాపోయినట్లు తెలిసింది.