pawan-kalyan-jaganకాకినాడ వేదికగా జరిగిన సభలో ‘ప్రత్యేక హోదా’ కార్యాచరణపై స్పష్టత ఇవ్వని పవన్ కళ్యాణ్, ఆ అవకాశాన్ని ముందుగా అధికార ప్రతిపక్షాలకే వదిలిపెట్టారు. పాచిపోయిన లడ్డూలను తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందా? లేదా అన్నది వారిష్టం అన్న పవన్ కళ్యాణ్, ‘స్పెషల్ స్టేటస్’పై ఇంకా పోరాటం చేయాలని, ఆ తర్వాత ఆ బాధ్యత ప్రతిపక్ష పార్టీగా వైకాపాపై కూడా ఉందని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు, వైసీపీ ఎంపీలు వల్ల కాకపోతే, అప్పుడు ‘జనసేన’ రంగంలోకి దిగుతుందని… తానూ ఒక్కడినే ‘ప్రత్యేక హోదా’ను సాధించుకోస్తానని చెప్పుకొచ్చిన వైనం తెలిసిందే.

అయితే పవన్ ఈ ప్రసంగం చేసే సమయానికే రాష్ట్రంలో ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల నుండి ‘స్పెషల్ స్టేటస్’పై ఒక స్పష్టమైన వైఖరి వెల్లడయ్యింది. రాష్ట్రం ఉన్న పరిస్థితుల రీత్యా కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్ ని తీసుకోకతప్పదని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేయగా, ‘స్పెషల్ స్టేటస్’ అంశాన్ని వదిలేది లేదు, ‘మీ వల్ల కాకపోతే నేను పోరాటం చేస్తాను, నేను సాధిస్తాను’ అంటూ వైసీపీ అధినేత జగన్ భుజాన వేసుకున్నారు. ఎవరు సాధించినా, అంతిమంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం ప్రజలకు ముఖ్యం. దానికి అనుగుణంగానే భవిష్యత్తులో ప్రజల మద్దతు ఉంటుందని చెప్పవచ్చు.

అయితే అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వల్ల కాని అంశం, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వల్ల అవుతుందా? ఇక్కడే పవన్ తెలివిగా జగన్ ను ఇరికించాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ‘ప్రత్యేక హోదా’ను వదిలేది లేదని అధికారికంగా టిడిపి చెప్తున్నప్పటికీ, ప్యాకేజ్ ఓకే అనడమంటే అది అనధికారికంగా చేతులేత్తేసినట్లే. దీంతో పవన్ చెప్పిన రెండు పార్టీలలో ఒక దానిపై స్పష్టత వచ్చేసింది. దీంతో నెక్స్ట్ బాల్ వైసీపీ కోర్టులో పడింది. ఈ పార్టీ కూడా తమ వల్ల కాదంటూ చేతులు ఎత్తేస్తే… అప్పుడు పవన్ రంగంలోకి దిగుతారన్న మాట.

ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చేతులెత్తేస్తే, ఇక ఆ పార్టీకి మనుగడ అనేది కష్టం. అంటే ఖచ్చితంగా ‘స్పెషల్ స్టేటస్’పై పోరాటం చేయాల్సిందే. మరో ఆప్షన్ లేదు. అలా కాని పక్షంలో బిజెపి మాదిరే వైసీపీ తీరును కూడా ఎండగడుతూ ఎదురుదాడే లక్ష్యంగా భవిష్యత్తులో పవన్ చెలరేగిపోతారన్న మాట. తన విషయంలో పవన్ క్లారిటీ ఇవ్వలేకపోయినప్పటికీ, జగన్ ను మాత్రం ‘స్పెషల్ స్టేటస్’ విషయంలో బాగా ఇరికించారని పొలిటికల్ వర్గాలు పేర్కొంటున్నాయి.