YS jagan pawan kalyan fan made wallpapersరాజకీయంగా మరియు సిద్ధాంత పరమైన విబేధాలతో వైరంగా మారిన వైకాపా అధినేత – జనసేన అధినేత అభిప్రాయాలు ఒక విషయంలో మాత్రం కలిసినట్లున్నాయని రాజకీయ వర్గాల టాక్. ప్రస్తుతం కష్టాల్లో ఉన్న పొరుగు రాష్ట్రం చెన్నైకు ఎవరికి తోచినంత సాయం వారు చేస్తున్నారు. ముఖ్యంగా ఆపద సమయంలో ముందుండే సినీ, రాజకీయ వాదులు తమ వంతులో భాగంగా ఆర్ధిక మరియు వస్తు రూపేణా సహాయం అందిస్తున్నారు. చిన్న, పెద్ద అందరిని కదిలించిన చెన్నై విపత్తు ఏపీలో ఉన్నటువంటి ఇద్దరు ప్రముఖులను మాత్రం కదిలించలేకపోయింది.

‘వరదల్లో చిక్కుకున్న వారిని ఆదుకోవాలంటూ తన కార్యకర్తలకు ఓ పిలుపునిచ్చి’ వైకాపా అధినేత జగన్ సరిపెట్టగా, ఈ అంశం పై ‘జనసేన’ అధినేత నుండి కనీస స్పందన లేకపోవడం అభిమానులను కూడా విస్మయానికి గురి చేస్తోంది. ఆపద వస్తే అందరి కంటే తమ హీరో ముందుంటాడని పవర్ స్టార్ అభిమానులు చెప్పుకుంటుంటారు. కానీ, చెన్నై విలయం పై పత్రికా ప్రకటన అటుంచితే కనీసం ‘ట్విట్టర్’ ద్వారా ఏమైనా ప్రకటిస్తారేమోనని అభిమాన గణం ఎదురు చూసింది.

ఒకవేళ షూటింగ్ బిజీలో ఉండి ఉంటారని సర్ధిచెప్పుకోవాలనుకున్నా, మనుషుల కంటే సినిమా ఎక్కువ కాదు కదా..! అందులోనూ ఉన్నతమైన విలువలకు తార్కాణంగా పవన్ గురించి ఆయన అభిమానులు భజన చేస్తుంటారు. మరి ఆ ‘ఉన్నత’ విలువలు ఇప్పుడు ఏమైనట్లు? అన్న ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. గతంలో తన ‘మెగా’ అన్న పుట్టినరోజు సందర్భంగా షూటింగ్ కాన్సిల్ చేసుకుని మరీ హాజరయ్యారు కదా!

ఓ చిన్న ప్రకటనతో సరిపెట్టిన జగన్ కు, అది కూడా ఇవ్వని పవన్ కు పెద్దగా వ్యత్యాసం లేదని పరిశీలకులు సైతం వాపోతున్నారు. ఇద్దరూ ఎంతో కొంత సహాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా చేయలేకపోవడమే విమర్శకులకు తావిచ్చేలా చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. బహుశా రాజకీయంగా తనకు పెద్దగా ప్రయోజనం చేకూరదని జగన్, సినిమాల పరంగా పెద్దగా మార్కెట్ లేదని పవన్ భావించి ఉంటారేమోనన్నభావాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పటికైనా ఆ సినీ, రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి మానవతా దృక్పధంతో స్పందిస్తారని ఆశిద్దాం.