Pawan Kalyan - YS Jagan - Narendra -Modiతెలుగుదేశం పార్టీ ఎన్డీయే ప్రభుత్వం నుండి బయటకు వచ్చాక మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రేపు గుంటూరులో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో మోడీ ప్రసంగించనున్నారు. అయితే రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీలోని అన్ని పార్టీలు నిరసనలకు రెడీ అవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని చోట్లా నిరసనలు తెలపాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తరువాతి రోజు రాష్ట్రప్రభుత్వం ఢిల్లీలో దీక్ష కూడా చేస్తుంది.

ప్రతిపక్ష పార్టీలు మోడీ పర్యటనను అడ్డుకుంటాం అని ప్రకటించాయి. అయితే మోడీతో అంటకాగుతున్నారు అని విమర్శలు ఎదురుకుంటున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్, జనసేన పార్టీలు మాత్రం ఇప్పటివరకు ప్రధాని పర్యటన నేపథ్యంలో తమ అభిప్రాయమేంటో చెప్పడం లేదు. ఈరోజు పలు టీవీ డిబేట్లలో ఇదే విషయం అడిగితే వైఎస్సాఆర్ కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు నాలుగున్నర ఏళ్ళు మోడీతో అంటకాగారు అంటూ విమర్శిస్తున్నారు.

చంద్రబాబు నాయుడు, మోడీ కలిసి ప్రజలను మోసం చేశారు అని ఆరోపిస్తున్నారు. ఇదంతా చెప్పారు గానీ ప్రధాని ఏపీ పర్యటన పై తమ పార్టీ స్టాండ్ ఏంటో మాత్రం చెప్పలేదు. జనసేన పార్టీ కూడా దీనిపై తమ స్టాండ్ చెప్పడం లేదు. అయితే ప్రధాని దేశంలో ఎక్కడైనా తిరగవచ్చని, ఆ అధికారం రాజ్యాంగం అందరికీ ఇచ్చిందని వారు తమ స్టాండ్ ఏంటో చెప్పకనే చెప్పారు. మరోవైపు ఈ సభను విజయవంతం చెయ్యడానికి బీజేపీ నాయకులు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నారు.