Pawan Kalyan - YS Jagan Mohan Reddyజనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యక్తిగత విమర్శలకు బదులుగా, పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరోసారి తమ ప్రతాపం చూపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను పెద్ద స్థాయిలో విమర్శలు చేయడంతో… అలాంటివి ఆపేయమంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేసారు.

“నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్ళను, తనకు సంబంధించిన పోరాటం అంతా పబ్లిక్ పాలసీల మీద మాత్రమే, తనకు ఎవరితో వ్యక్తిగత విభేదాలు లేవు కనుక, జగన్ మోహన్ రెడ్డి గారిని కానీ, ఆయనకు కుటుంబ సభ్యులను గానీ, వారింటి ఆడపడుచులను గానీ ఈ వివాదంలోకి లాగవద్దని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను” అంటూ తన ఫ్యాన్స్ కు విన్నవించుకున్నారు పవన్ కళ్యాణ్.

జగన్ టంగ్ స్లిప్ అయ్యి తనను విమర్శించినా, తానేం వ్యక్తిగత విమర్శలు చేయను, అభిమానులు కూడా కంట్రోల్ లో ఉండాలంటూ జగన్ ఇచ్చిన పిలుపు ఆహ్వానించదగినదే, ఆలస్యం చేయకుండా సకాలంలో స్పందించినట్లే! అయితే ఒక్క జగన్ మోహన్ రెడ్డి విషయంలోనే పవన్ కళ్యాణ్ కు ఎందుకంత ప్రేమ అన్నది మాత్రం అర్ధం కాని అంశంగా మారింది. బహుశా అధిష్టానం ఆదేశాలు అలా ఉన్నాయంటారా?!

ఏమో… అది ఇప్పుడే చెప్పలేం గానీ, ఒక్కసారి జగన్ ను పక్కనపెట్టి రేణుదేశాయ్ విషయానికి వస్తే…. పవన్ కు లెక్కలేనన్ని ప్రశ్నలు ఎదురవుతాయి. ఇదే పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రేణుదేశాయ్ ను వ్యక్తిగతంగా దూషించడం పక్కన పెడితే, అసభ్య పదజాలంతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది గత రెండు, మూడు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున జరుగుతోంది.

మహిళామణులకు అండగా ఉంటానని నిత్యం కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ కు, తన మాజీ భార్య ఒక మహిళ అన్న సంగతి మరిచిపోయారా? ఎన్నో సార్లు రేణుదేశాయ్ ఈ విషయంలో తన ఆవేదనను వ్యక్తపరిచింది, మీడియా వేదికగా కూడా పవన్ ఫ్యాన్స్ ను విన్నవించుకుంది. కానీ ఏనాడూ ‘రేణుదేశాయ్ ను విమర్శించవద్దని’ తన అభిమానులకు ఒక్క సూచన కూడా చేయలేని పవన్, వైసీపీ అధినేత విషయంలో మాత్రం ఒక్కరోజులోనే స్పందించడం వెనుక ఆంతర్యం ఏమిటి?!

అంటే మహిళల విషయంలో పవన్ చెప్పేవన్నీ కాకరకాయ కబుర్లని అనుకోవాలి. నిజంగా చెప్పాలంటే రేణుదేశాయ్ ను ఇప్పటికీ సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ వేధిస్తూనే ఉన్నారు. మరి ఆమె విషయంలో ఎందుకు ఫ్యాన్స్ ను నియత్రించే విధంగా ప్రవర్తించడం లేదు. మ్యాటర్ ని ఇక్కడ కట్ చేసి, ఇటీవల “మీడియాపై యుద్ధం” అంటూ పవన్ చేసిన “అద్భుతాలు” ఏమిటో ఆయనకు గుర్తున్నాయా?

మీడియా అధినేతల కుటుంబాలకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ అసభ్యకరంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వ్యక్తిగత విమర్శలు అనుకోవాలా? లేక పబ్లిక్ పాలసీ విమర్శలు అనుకోవాలా? ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాలా పెద్దగానే ఉంటుంది. కానీ ఎవరిపైన ఒక్క ట్వీట్ కూడా వేయని పవన్ వర్యులు ఒక్క జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఎందుకంత త్వరగా స్పందించారో కూడా చెప్తే బాగుంటుంది. భయమా?! ప్రేమా?!