Pawan-Kalyan-YS-Jaganశుక్రవారం కాకినాడలో కాపు నేస్తం బటన్ నొక్కుడు కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి “వచ్చే ఎన్నికలలో దత్తపుత్రుడు (పవన్‌ కళ్యాణ్‌)కు ఓట్లు వేసినట్లయితే ఆయన వాటిని చంద్రబాబు నాయుడుకి అమ్మేసుకొంటారు,” అంటూ చేసిన దారుణమైన వ్యాఖ్య కాపు ప్రజలను అవమానించడంగానే భావించవచ్చు.

పవన్‌ కళ్యాణ్‌ ఏనాడూ తాను కాపు కులస్తుడినని, కనుక రాష్ట్రంలో కాపులందరూ తనకే ఓట్లు వేయాలని కోరలేదు. ఒకవేళ పవన్‌ కళ్యాణ్‌ రాష్ట్రంలోని కాపు ఓటర్లను ఆకట్టుకోవాలనుకొంటే వేరే విదంగా ముందుకు వెళ్ళిఉండేవారు. కానీ ఆయన అటువంటి ప్రయత్నాలు చేయలేదు. గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు కూడా. అంటే కాపు కులస్థులు మద్దతు కూడగట్టలేదని స్పష్టం అవుతోంది.

ఇతర పార్టీలు కులాల వారీగా ప్రజలను విడదీసి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంటే, జనసేన పార్టీ ఒక్కటే అన్ని కులాలను కలపడమే తమ విధానమని ప్రకటించింది. నేటికీ జనసేన అదే విధానంతో ముందుకు సాగుతోంది.

ఇక సిఎం జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఈ దత్తపుత్రుడు విషయానికి వస్తే, టిడిపితో పొత్తు పెట్టుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ ఆలోచిస్తున్నారు కనుక కాపు ఓటర్లు అందరూ పవన్‌ కళ్యాణ్‌ వెంట చంద్రబాబు నాయుడు వైపు వెళ్ళిపోతే వైసీపీ నష్టపోతుందని భయపడుతున్నట్లు అర్దమవుతోంది. అంతే కాదు రాష్ట్రంలో కాపులందరూ పవన్‌ కళ్యాణ్‌ వెంట ఉన్నారని జగన్‌ కూడా గట్టిగా నమ్ముతున్నట్లు స్పష్టమవుతోంది. కనుకనే జగన్‌ పదేపదే పవన్‌ కళ్యాణ్‌ పట్ల కాపులలో వ్యతిరేకత కల్పిచేందుకు దత్తపుత్రుడు అంటూ సంభోదిస్తున్నారని చెప్పవచ్చు.

అయితే టిడిపితో పొత్తు గురించి ఎన్నికలకి ఇంకా రెండేళ్ళ సమయం ఉండగా ఇప్పటి నుంచే పవన్‌ కళ్యాణ్‌ బహిరంగంగా తన అభిప్రాయాలూ చెపుతున్నారు. కనుక పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయం నచ్చితే కాపు కులస్థులు జనసేనకు ఓట్లు వేస్తారు లేకుంటే లేదు. పవన్‌ కళ్యాణ్‌ ఇంత స్పష్టంగా వ్యవహరిస్తుంటే, చంద్రబాబు నాయుడు-పవన్‌ కళ్యాణ్‌ మద్య ఏదో రహస్య అవగాహన ఉందన్నట్లు, చంద్రబాబు నాయుడుని గెలిపించేందుకే పవన్‌ కళ్యాణ్‌ నడుంబిగించినట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుండటం ఆయనలో అభద్రతాభావాన్ని అద్దం పడుతోంది.

అయితే పవన్‌ కళ్యాణ్‌కి ఓట్లు వేస్తే వాటిని ఆయన చంద్రబాబు నాయుడుకి అమ్ముకొంటాడు అని జగన్ చెప్పడం చూస్తే కాపు కులస్తులకు విజ్ఞత, విచక్షణా జ్ఞానం కూడా లేవని అవమానిస్తునట్లుగానే భావించవచ్చు.