pawan kalyan you have to question ruling sideపవన్… జగన్… ఈ రెండు పేర్ల మధ్య ఉన్న ప్రాస వీరి మధ్య ఉండదనేది బహిరంగ సత్యమే. ‘ఒకరు ఊ…, అంటే ఇంకొకరు ఊహూ.. అంటారు.’ ఈ ఇద్దరి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఒక విషయంలో ఏకాభిప్రాయానికి రావడమే కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని రాజకీయ వర్గాలలో హాట్ హాట్ గా చర్చ జరుగుతుంది. అదేంటంటే ఇద్దరి ఉద్దేశం ప్రతిపక్షాలు పాలక పక్షాన్నే విమర్శించాలని!

పవన్ పార్టీ పెట్టిన నాటి నుండి ప్రతిపక్షంలోనే ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జనసేన ఆవిర్భావ సభ నిర్వహించి అప్పటి పాలకపక్షాన్ని నిలదీశారు పవన్. అయితే పాదయాత్రల పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్న జగన్ కన్నా పవన్ దృష్టికే ప్రజా సమస్యలు ఎక్కువగా చేరేవి.., అంతేకాక వాటి పరిష్కారానికి ప్రభుత్వం కూడా చొరవ చూపేది.

దీంతో నాటి ప్రతిపక్ష పార్టీ సరైన పాత్ర పోషించడం లేదని, ప్రజా సమస్యల మీద కాకుండా జగన్ తన పార్టీ బలోపేతం మీదే ఎక్కువగా చొరవ చూపిస్తున్నారని.., ప్రతిపక్షాల తీరు ఇలా ఉండకూడదని., అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన వైస్సార్సీపీ మీద కూడా విమర్శల అస్త్రాన్ని ఎక్కుపెట్టేవారు.

అయితే దీనికి ప్రతిస్పందనగా పార్టీ అధినేత అయిన జగన్ గారు చెప్పిన విషయం ఏమిటంటే… పార్టీ పెట్టి ప్రజలలో తిరుగుతూ సభలు నిర్వహిస్తే నిలదీయాలసింది.., ప్రశ్నించాల్సింది …, విమర్శలు చేయాల్సింది ప్రభుత్వం మీద కానీ ప్రతిపక్ష పార్టీ అయిన తమపై కాదు అని పవన్ ను ఉద్దేశించి ఎన్నో బహిరంగ సభలలో ఘాటైన వ్యక్తిగత విమర్శలు కూడా చేశారు. పవన్ విమర్శలను అడ్డుగా చూపి “పవన్ ౼ బాబు” ఇద్దరు ఒక్కటే అనే ప్రచారాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లి కొంత తన విజయానికి బాటలు వేసుకున్నారు జగన్.

ప్రజల పక్షాన నిలచిన వాడు నిలదీసేది పాలక పక్షాన్ని అని అది కూడా తెలియని పవన్ రాజకీయాలు ఏం చేస్తారని ఎద్దేవా చేశారు జగన్. అయితే జగన్ తాను చేసిన ఈ ప్రచారాలన్నీ తన ఎన్నిక వ్యూహంలో భాగమే అని తెలుసుకొనే లోపే జరగాల్సిన నష్టం అటు జనసేన పార్టీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి జరిగిపోయింది.

“చేతులు కాలాక ఆకులూ పట్టుకున్న” తీరుగా అయిపోయింది రాష్ట్రంలో ఈ రెండు పార్టీల పరిస్థితి అని వాపోయారు రెండు పార్టీల మద్దతుదారులు. జగన్ ఉద్దేశం ప్రకారం చూసుకుంటే ఇప్పుడు పవన్ కు అర్ధమయ్యే ఉంటది తానూ నిలదీయాల్సింది ఏ పార్టినో అని!?

అన్ని రోజులు ఒకే చందంగా ఉండవనేది జగన్ ఉద్దేశం కావచ్చు. అందులో భాగంగానే ఇప్పటి ప్రభుత్వాన్ని ఎవరు విమర్శించినా సహించలేని స్థితిలో ఉన్నారు జగన్ & కో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబుని నడిరోడ్డుపై ఉరి తీయాలని ఎవరు అనడానికి కూడా సాహసించని పదాలతో జగన్ విమర్శించారు. ఇప్పుడు పవన్ పాలక పక్షాన్ని విమర్శిస్తే టీడీపీ తో పవన్ మళ్ళీ జత కడతారని.., జనసేన – టీడీపీ రెండు ఒకే గూటి పక్షులు అనే ప్రచారాన్ని వెలుగులోకి తెస్తారేమో చూడాలి.

అయితే ఇందులో వింతేమిటంటే పవన్ ఎవరిని విమర్శించాలో కూడా జగనే చెప్పడం. జగన్ తీరు చూసి జనసేన అభిమానులు మాత్రం “మా రాజకీయం కూడా మీరే చేసేస్తే ఇంకా మేమెందుకు సారూ..!” అంటూ పంచ్ డైలాగ్స్ పేలుస్తున్నారు. మరి చూడాలి తన రాజకీయ ప్రత్యర్థి అయినా జగన్ సూచన పవన్ పాటిస్తారో లేదో..!?