Pawan kalyan why so much in hurry పవన్ కళ్యాణ్‌ రాజకీయాలలోకి వచ్చి అప్పుడే ఏడేళ్ళుపైనే అవుతోంది కానీ రాజకీయాలను పూర్తిగా ఒంట బట్టించుకొన్నట్లు లేదు. బహుశః నిజాయితీ వల్ల కావచ్చు లేదా రాజకీయ అమాయకత్వం వల్ల కావచ్చు కొన్నిసార్లు తొందరపాటుతో లేదా అసందర్భంగా మాట్లాడి తన రాజకీయ అజ్ఞానాన్ని బయటపెట్టుకొంటుంటారు. ఇవాళ్ళ ఏలూరు జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడిన ఈ మాటలు వింటే నిజమనిస్తుంది.

“నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి ఎదగాలని నమ్మేవాడిని కనుక ప్రజలు నన్ను ఆశీర్వదించి ముఖ్యమంత్రి పదవి ఇస్తే చేపడతాను లేకున్నా ప్రజలకు దాసుడుగానే పనిచేస్తుంటాను. నాకు అధికారం ఇస్తే నేనేమి చేస్తానో చెప్పడం లేదు. నాకున్న శక్తిని బట్టి కష్టాలలో ఉన్న ప్రజలకు ఏమి చేయగలనో అది మాత్రమే చేసుకుపోతున్నాను. ప్రజలు నన్ను రెండు చోట్ల ఓడించినా నేను బాధపడలేదు. ఆ ఓటములే నా రాజకీయ జీవితానికి, గెలుపుకి బలమైన పునాదులని నమ్మ బట్టే ఓడిపోయినా మళ్ళీ మీ కోసం పని చేసేందుకు మీ ముందుకు వస్తున్నాను,” అని అన్నారు.

రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా సుమారు రెండేళ్ళు సమయం ఉంది. పైగా పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు కౌలు రైతులకు సాయం చేసేందుకు వచ్చారు కానీ రాజకీయ, ఎన్నికల యాత్రకో రాలేదు. వచ్చే ఎన్నికలలో పోటీ ప్రధానంగా వైసీపీ, టిడిపిల మద్యే ఉంటుందని రాజకీయ అజ్ఞానులకు కూడా తెలుసు. కనుక ఒకవేళ జనసేన టిడిపితో పొత్తులు పెట్టుకొంటే ఓ 10-15 లేదా 20-30 సీట్లు మాత్రమే లభించవచ్చు. వాటిలో జనసేన ఎన్ని సీట్లు గెలుచుకోగలదో తెలీదు. ఒకవేళ అన్నీ గెలుచుకొన్నా పవన్ కళ్యాణ్‌ ముఖ్యమంత్రి కాలేరు.

అలాగని ఒంటరిగా పోటీ చేస్తే రాజకీయాలలో కొమ్ములు తిరిగిన వైసీపీ, టిడిపిలను ఎదుర్కొని ఓడించలేరు. ఇక పొరుగున తెలంగాణ రాష్ట్రంలో మంత్రి కేటీఆర్‌ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో రెండో స్థానంలో ఉంటూ, రాష్ట్ర రాజకీయాలను, అభివృద్ధిని శాశిస్తున్నప్పటికీ, తనకు ఈ పదవే చాలా ఎక్కువని ముఖ్యమంత్రి పదవి ఆశించడం లేదని సవినయంగా చెప్పుకొంటుంటే, ఇంకా పార్టీనే పూర్తిగా నిర్మించుకోలేకపోయిన పవన్ కళ్యాణ్‌, రాష్ట్రంలో రాజకీయ బలాబలాలు, సమీకరణాలు తెలుసుకోకుండానే ‘నేను ముఖ్యమంత్రిని అయితే…’ అంటూ మాట్లాడటం చాలా తొందరపాటే అవుతుంది.