Pawan Kalyan Vs Chiranjeevi in Karnataka Electionsవచ్చే నెలలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, కాంగ్రెస్ తరఫున చిరంజీవి ప్రచారం చేయనున్నారని జరుగుతున్న ప్రచారం తెలిసిందే. ఇదిలా ఉంటే తన మిత్రుడు జేడీ (ఎస్) నేత కుమారస్వామి కోరిక మేరకు, ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని తెలుస్తోంది. దీంతో కన్నడ నాట మెగా బ్రదర్స్ మధ్య ప్రచార పోరు తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలూ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్, బీజేపీలు ప్రచారంలో ముందున్నాయి. కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ ఏకంగా మూడు వారాల పాటు రాష్ట్రంలో మకాం వేసి, దాదాపు 30కి పైగా సభల్లో ప్రసంగాలు చేయనుండగా, బీజేపీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగి పర్యటనలు సాగిస్తున్నారు.

ప్రస్తుతం చిరంజీవి తన కొత్త సినిమా ‘సైరా’ షూటింగ్ లో బిజీగా ఉండగా, ఇటీవలే పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కళ్యాణ్, ఏపీకి హోదా కోసం ఉద్యమిస్తున్నారు. ఇక కర్ణాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారగా, ఈ పోరును అటు కాంగ్రెస్, ఇటు బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. కర్ణాటకలో దూరమైన అధికారాన్ని తిరిగి సాధించుకునే యత్నాల్లో బీజేపీ ఉండగా, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న కృత నిశ్చయంతో సిద్ధరామయ్య దూసుకెళుతున్నారు.

ఇటీవలి ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రజలు ఉన్నారని చెప్పినప్పటికీ, ఎన్నికలకు మరో నెల రోజుల సమయం ఉండటంతో ఏదైనా జరగవచ్చు. ఇక కర్ణాటక, ఆంధ్రా సరిహద్దు జిల్లాలైన బళ్లారి, గుల్బర్గా, బీదర్ తదితర ప్రాంతాల్లో జయాపజయాలను నిర్ణయించగలిగే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారు. వీరిని మెప్పించగలిగితే, అధికారానికి మరింత దగ్గర కావచ్చన్నది రాజకీయ పార్టీల అభిప్రాయం.

కాంగ్రెస్ తరఫున చిరంజీవి ప్రచారానికి షెడ్యూల్ కూడా ఖరారైనట్టు సమాచారం. ఈ నెల ఆఖరు వారంలో ఆయన పర్యటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. పవన్ ప్రచారంపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఆయన జేడీ (ఎస్) తరఫున సరిహద్దు జిల్లాల్లో ప్రచారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే కర్ణాటక కేంద్రంగా మెగా బ్రదర్స్ మధ్య జరిగే తొలి పొలిటికల్ వార్ ఇదే అవుతుందనడంలో సందేహం లేదు.