Pawan Kalyan travelling to Eluru from Hyderabad via Vijayawadaజనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుండి పోటీ చెయ్యబోతున్నారు. వామపక్షాలతో తప్ప ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ప్రకటించారు ఆయన. 2014 ఎన్నికల తరువాత పవన్ కళ్యాణ్ ఏలూరులో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని తన ఓటును నమోదు చేసుకున్నారు. దానితో అందరూ ఆయన ఏలూరు నుండి పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు మరోసారి తన ఓటును మార్చుకున్నారు.

విజయవాడలో తన ఓటు నమోదు చేసుకున్నారు. విజయవాడలోని కోగంటి లోని ఒక ఇంటిని తాను ఉంటున్న నివాసగృహంగా చూపించి తన ఓటు నమోదు చేసుకున్నారు. ఎన్నికల సంఘం అధికారులు పవన్ కళ్యాణ్ లాయర్లు ఇచ్చిన డాక్యూమెంట్లతో సంతృప్తి చెంది ఆయన ఓటును నమోదు చేశారు. ఓటు నమోదుకు చివరి తేదీ కూడా దాటిపోవడంతో ఇక పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో ఇక్కడ నుండే ఓటు వెయ్యబోతున్నారు. ఈ సంవత్సరం మొదటి నుండీ పవన్ కళ్యాణ్ విజయవాడ నుండే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన జనసేన పోరాట యాత్రలో భాగంగా కర్నూల్ లో పర్యటిస్తున్నారు. రేపటితో జనసేన పార్టీ అభ్యర్ధిత్వాల నమోదు పూర్తి అవుతుంది. ఇక టిక్కెట్ల కేటాయింపు మాత్రమే మిగిలి ఉంది. మరో వైపు పవన్ గాజువాక నుండే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది. స్క్రీనింగ్ కమిటీ కూడా గాజువాక నుంచి పోటీకే మొగ్గు చూపుతోందన్న సమాచారం ఉంది. రాష్ట్రంలో లక్ష సభ్యత్వాలతో గాజువాక నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవడంతో పార్టీ అధినేతను అక్కడి నుంచే పోటీకి దింపాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.