Pawan_Kalyan_Varahi_JanaSena_Vijayawadaజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రెండు తెలుగు రాష్ట్రాలలో తన రాజకీయ పర్యటనలు, ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారుచేయించుకొన్న ‘వారాహి’ వాహనానికి నిన్న తెలంగాణలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేయించిన తర్వాత ఈరోజు తొలిసారిగా దాంతో ఏపీలో ప్రవేశించారు. బుదవారం ఉదయం విజయవాడ ఇంద్రకీలాద్రిలో కనకదుర్గమ్మని దర్శించుకొని ప్రత్యేకపూజలు చేసిన తర్వాత తన వారాహి వాహనానికి వాహనపూజ చేయించుకొన్నారు.

పవన్‌ కళ్యాణ్‌ పేరు చెపితేనే మంత్రులు మండిపడుతుంటారు. ఆయన మిలటరీ వాహనాన్ని పోలి ఉన్న వారాహికి వేసిన రంగు (మిలటరీ వాహనాలకి మాత్రమే అనుమతించబడిన రంగు)పై తొలుత మాజీ రాష్ట్ర రవాణా మంత్రి పేర్ని నాని అభ్యంతరం చెప్పారు. కానీ అది దానికి దగ్గరగా ఉండే వేరే రంగు అని తెలంగాణ రవాణాశాఖ తేల్చి చెప్పడంతో, వారాహికి తెలంగాణ ప్రభుత్వం జాతీయస్థాయి పర్మిట్ ఇచ్చినప్పటికీ దానిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని, అవసరమైతే ఏపీ రవాణాశాఖ సూచనల ప్రకారం వారాహికి మార్పులుచేర్పులు చేయాల్సి ఉంటుందని లేకుంటే రోడ్లపై తిరగనీయమని హెచ్చరించారు. అయితే అసలు కారణం జనసేనని, పవన్‌ కళ్యాణ్‌ని అధికార వైసీపీ రాజకీయ శత్రువుగా భావిస్తుండటమే అని అందరికీ తెలుసు.

ఇవాళ్ళ వారాహి తొలిసారిగా ఏపీలో ప్రవేశించింది కనుక అసలు కధ ఇప్పుడే మొదలైన్నట్లు భావించవచ్చు. ముందుగా మంత్రులు రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నలుగురూ మొదలుపెట్టాల్సి ఉంది. ఆ తర్వాత రాష్ట్ర రవాణా మంత్రి పినిపే విశ్వరూప్ స్పందించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారాహికి ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలని చెపుతారో, అది ఏపీలో తిరగడానికి ఎన్ని ఆంక్షలు విధిస్తారో చూడాల్సిందే. ఆలోగా వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకొన్న రాంగోపాల్ వర్మ తాను పవన్‌ కళ్యాణ్‌ అభిమానిని అంటూనే ఆయన కాషాయ వేషధారణ, వారాహి పేరు గురించి చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు.