Ustaad Bhagat Singh First Glimpseస్టార్ హీరోలు రాజకీయాల్లో ప్రవేశించేటప్పుడు లేదా ఏళ్ళ తరబడి నడుపుతున్న పార్టీకి కొత్త జవసత్వాలు తీసుకురావాలనుకున్నప్పుడు వాళ్ళు చేసే సినిమాల మీద ప్రజలకు రాజకీయ పార్టీలకు ఎంతో సునిశిత దృష్టి ఉంటుంది. అందుకే కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించాలని నిర్ణయించుకున్నప్పుడు చేసిన చివరి రెండు చిత్రాలు బొబ్బిలి పులి, నా దేశం. పూర్తిగా ఆయన భావజాలాన్ని సమాజం పట్ల బాధ్యతను వీలైనంత ప్రేక్షకులకు చెప్పాలని దర్శకులు ప్రయత్నించారు.

తర్వాత టిడిపి గెలవడం అక్కడి నుంచి చరిత్ర మలుపు తిరగడం ఇలా చాలా ఘట్టాలున్నాయి. ముఖ్యమంత్రయ్యాక తనలో నటుడిని అణిచి ఉంచలేక తీసిన బ్రహ్మర్షి విశ్వామిత్ర, సామ్రాట్ అశోకను జనం ఆదరించలేదు. వీటిలో డ్యూయెట్లున్నాయి. కానీ మేజర్ చంద్రకాంత్ కు బ్రహ్మరథం పట్టారు. తమకు ఇష్టమైన నాయకుడిని ఎలా చూడాలనుకుంటారో ఆ అంచనాలకు తగ్గట్టు తెరమీద ఆవిష్కరించినప్పుడే విజయాలు దక్కుతాయి. అందుకే చిరంజీవి ప్రజారాజ్యం పెట్టే టైంలో యాక్టింగ్ కి పూర్తిగా విరామం ఇచ్చేసి ఎనిమిదేళ్లు మేకప్ వేసుకోలేదు.

అప్పటి ఇప్పటి పొలిటికల్ వాతావరణంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. పవన్ కళ్యాణ్ జనసేనను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాడనే దాని మీద పార్టీలు ఎంత ఆసక్తిగా ఉన్నాయో చెప్పనక్కర్లేదు. టిడిపితో పొత్తు గురించి నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తునే సీఎం పదవి మీద తొందరపడి డిమాండ్ చేయనని క్లారిటీ ఇచ్చారు. దీని వెనుక ఉన్న లోతైన కోణం గురించి మెల్లగా అర్థమవుతుంది కానీ పార్టీకి అవసరమైన నిధుల కోసం వరసగా సినిమాలు చేస్తున్న పవన్ మీద విశ్లేషించుకోవాల్సిన ఇంకో ఫోకస్ ఉంది.

ఉస్తాద్ భగత్ సింగ్ చిన్న వీడియో టీజర్ కోసం ఫ్యాన్స్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో భారీ హంగామా చేశారు. ఇదో పక్కా కమర్షియల్ సినిమా. శ్రీలీలతో ఆడిపాడే పాటలుంటాయి. ఓజిలో ప్రియాంకా మోహన్ తో రొమాంటిక్స్ సాంగ్స్ పెట్టొచ్చు. మార్కెట్ తో పాటు ఫ్యాన్స్ అంచనాలకు అనుగుణంగా ఇవన్నీ తప్పవు. కానీ ఒక బలమైన ప్రత్యాన్మయ రాజకీయ నాయకుడిగా తనను చూస్తున్న జనంలో ఇవి ఎలాంటి అభిప్రాయాన్ని కలగజేస్తాయన్నది కీలకం. బ్రో, హరిహరవీరమల్లుకి ఈ సమస్య లేదు. థియేటర్లకొచ్చి ఎగబడి చూస్తున్న అభిమానులంతా ఓట్లుగా మారలేని పరిస్థితిలో కేవలం నెలల వ్యవథిలో ఎన్నికలతో పవన్ చేయబోయే ప్రయాణం ఎలా ఉండనుందో.