Pawan Kalyan using bharat Ane Nenu Dialoguesకొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటించిన “భరత్ అనే నేను” సక్సెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల అభినందనలు అందుకున్న ఈ సినిమాలో రాజకీయంగా పలు అంశాలను విస్పష్టంగా చర్చించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ‘జవాబుదారీతనం’ అన్న పదాన్ని దర్శకుడు కొరటాల ముఖ్యమంత్రి పాత్ర చేత పదే పదే చెప్పించి, రాజకీయాలలో అది చాలా ముఖ్యమని నొక్కివక్కాణించారు.

గడిచిన రెండు, మూడు ప్రెస్ మీట్లుగా ‘జనసేన’ అధినేత నోట ఇవే వ్యాఖ్యలు వస్తుండడం, అలాగే ప్రెస్ నోట్ లలోనూ ‘జవాబుదారీతనం’ను హైలైట్ చేస్తూ విడుదల చేస్తుండడం విశేషం. కాకతాళీయమో లేక స్ఫూర్తి పొందారో తెలియదు గానీ, ‘భరత్ అనే నేను’ విడుదల తర్వాత ఈ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత లభిస్తోంది. బస్సు యాత్ర గురించి తాజాగా విడుదల చేసిన ప్రెస్ నోట్ లో కూడా ఆ సినిమాలో వినియోగించిన ‘పొలిటికల్ అకౌంటబిలిటీ’ గురించి పేర్కొనడం విశేషం.

బహుశా జనసేన అధినేత మైండ్ లో ముందుగానే ఉండి ఉండొచ్చు గానీ, అది ఇప్పుడు బయటకు వస్తుండడం గమనించదగ్గ అంశం. అందుకే ‘భరత్ అనే నేను’ సినిమా పవన్ కళ్యాణ్ చేసి ఉంటే బాగుండేదని పవర్ స్టార్ అభిమానులు ఆశించారు. ఏది ఏమైనా ఏ పార్టీ అధికారంలో ఉన్నా… ‘జవాబుదారీతనం’ అనేది రాజకీయాల్లోకి రావడం అత్యవసరం. అయితే ఇది అర్ధమయ్యే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలగడం ముఖ్యం. మరి అందులో ‘జనసేన’ అధినేత ఎలా చెప్పుకోస్తారనేది వేచిచూడాలి.