Pawan Kalyan - Undavalli - Aruna - Kumar-ఉండవల్లి నాయకత్వంలోని అప్పటి కాంగ్రెస్ ఎంపీలు సమైక్యాంధ్ర ఉద్యమంను పక్కదారి పట్టించారని నిపుణులు అంటూ ఉంటారు. రాజినామాలని, పెప్పర్ స్ప్రే అని, అవిశ్వాస తీర్మానం అని, కిరణ్ దగ్గర చివరి బంతి ఉందని, సస్పెన్షన్లని ఏవేవో చెప్పి ప్రజలను మభ్య పెట్టేవారు. వారంతా ఏవో చేస్తునట్టుగానే కనిపిస్తూ ఏమి చెయ్యకుండా విభజన జరగనిచ్చారు.

అయితే ప్రజలు దానిని పసిగట్టడంతో అందులో కొందరు పోటీ చేసి ఓడిపోయారు. కొందరు అసలు పోటీకి కూడా సాహసించలేదు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఉద్యమం కూడా తప్పు దారి పడుతుందా? అంటే అవును అనే అంటున్నారు నిపుణులు. ఉండవల్లి అవిశ్వాసతీర్మానం అనగానే పవన్ కళ్యాణ్, జగన్ మోహన్ రెడ్డి అదే పాట పడటం మొదలు పెట్టారు.

అసలు కేంద్రంపై అవిశ్వాసతీర్మానం పెట్టడం వల్ల ఒరిగేదిమాత్రం ఏమి కనపడటం లేదు. ఎన్డీయేకు లోక్‌సభలో 332 సభ్యులకు పైగా బలముంది. దీంతో పాటు అన్నాడీఎంకే.. తదితర పక్షాలు బయటనుంచి మద్దతు ఇస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం 25 మంది సభ్యులు లోక్‌సభలో ఉన్నారు. వీరిలో ఇద్దరు భాజపాకు చెందినవారు. వారు ఎలాగూ దీనికి మద్దత్తు ఇవ్వరు.

మిగిలిన 23 మందిలో 15 మంది తెదేపా, 8 మంది సభ్యులు వైకాపా తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఎన్డీయేలోని అతిపెద్ద పార్టీ భాజపాకు 273 సభ్యుల బలంతో పాటు స్పీకర్‌ ఉన్నారు. అదనంగా ఇద్దరు నామినేటడ్‌ సభ్యులున్నారు.ఎన్డీయేను తీసుకుంటే మొత్తం 330కు పైగా బలముంది. ఒకవేళ తెలుగుదేశం అవిశ్వాసానికి మద్దతు పలికినా పాలక పక్షానికి ఎటువంటి ప్రమాదం లేదు.

ఒక్క సభ్యుడైన అవిశ్వాసం పెట్టొచ్చు. 50 మందికి పైగా సభ్యులు తీర్మానానికి మద్దతు పలికితే ఒక రోజును తీర్మానంపై చర్చకు నిర్ణయిస్తారు. అనంతరం దానిపై ఓటింగ్‌ ఉంటుంది. ఓటింగ్ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం ఉండదు అని ముందే చెప్పుకున్నాం. ఇక అవిశ్వాస తీర్మానం సంధర్భంగా జరిగే చర్చలో పాలక పక్షం పాడిందే పాటరా అంటూ మేము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం అంటుంది. దీనివల్ల రాష్ట్రానికి ఏం ఉపయోగం అనేది ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న.