pawan-kalyan-tweets-on-national-anthem-in-theatres-questioning-tweetసినిమాల ప్రదర్శన జరిగే ముందు ధియేటర్లలో ఖచ్చితంగా జాతీయగీతాన్ని ఆలపించాలనే సుప్రీంకోర్టు నిబంధనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తమకు దేశభక్తి ఉన్నప్పటికీ, అది నిరూపించుకోవాల్సిన ప్రదేశం సినిమా హాలు కాదని కొందరు వాదించడంతో… కేసులు కూడా నమోదవుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు నిబంధనలు కావడంతో… దీనిపై ఏ ప్రముఖ వ్యక్తి కూడా విభేదించి తమ అభిప్రాయాలను చెప్పే సాహాసం చేయలేకపోయారు.

కానీ, ‘జనసేన’ అధినేత మాత్రం ఈ ‘బలవంతపు’ దేశభక్తిని తూర్పారపడుతూ ట్వీట్లు చేయడంతో… సోషల్ మీడియా ‘జిందాబాద్’ అంటూ పవన్ కు మద్దతు పలుకుతోంది. ఒక సాధారణ సాయంత్రం నాడు కుటుంబంతోనో, స్నేహితులతోనో కాసేపు హాయిగా గడుపుదామని సినిమాకు వెళ్ళే సమయం “దేశభక్తి”ని కొలిచే కొలమానమా? అంటూ నిలదీసారు. నిజమైన దేశభక్తి మానవతా విలువలలో ఉంటుందని అన్న ‘జనసేన’ అధినేత, ‘దేశభక్తి’పై రాజకీయ పార్టీలను ప్రశ్నించారు.

రాజకీయ పార్టీలు తమ సమావేశాలను ఎందుకు జాతీయ గీతాలతో ప్రారంభించవని, అలాగే దేశంలోనే పవర్ హౌస్ లకు నిలయాలుగా ఉన్న కార్యాలయాలలో ఎందుకు ఆలపించరని, ఎందుకు సినిమా హాలులలోనే? అని సూటిగా ప్రశ్నించారు. చట్టాలను తయారుచేసే పాటించి, అందరికీ మార్గదర్శకులుగా ఉండాల్సిందిపోయి, కేవలం ‘సైన్ పోస్ట్స్’లా ఉండడం ఎంతవరకు సమంజసమో అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు బ్రహ్మరధం పడుతున్నారు.

నిజానికి పవన్ చేసిన వ్యాఖ్యలు చాలా మందిలో ఉన్నవే. వినోదం కోసమని సినిమా హాలుకు వెళితే… అక్కడ దేశభక్తి పేరుతో జాతీయ గీతాన్ని అలపించాలనే నిబంధనపై అంతర్గతంగా చాలామంది పెదవి విరుస్తున్నారు. పవన్ లాంటి ప్రముఖ వ్యక్తి దీనిని నిలదీయడంతో ఒక్కసారిగా వారికి కొండంత అండ లభించినట్లయ్యింది. దీంతో పవన్ ట్వీట్స్ ను షేర్ చేసుకుంటూ నీరాజనం పడుతున్నారు.