Pawan Kalyan - JFCనిజనిర్ధారణ పేరుతో దాదాపుగా డజన్ మంది మేధావులను ఒక చోట కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సాయం ఎంతో లెక్క కట్టే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్. మొత్తం ప్రక్రియలో మొత్తానికి ఏం చేశారో తెలీదుగానీ, ఆ పార్టీ ట్విట్టర్ అకౌంట్ నుండి వచ్చిన ఒక విషయం మాత్రం ముక్కున వేలేసుకునేలా చేసింది.

సదరు ఆ ట్వీట్లో అమరావతిలో రాష్ట్రప్రభుత్వం ఒక ప్రైవేట్ సంస్థకు 200 ఎకరాలు కేటాయించింది కానీ ప్రతిష్టాత్మక ఐఐఎంకు స్థలం ఇప్పటికి కేటాయించలేదని చెప్పుకొచ్చింది. ఐఐఎం తరగతులు ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీలోనే జరుగుతున్నాయి అని చెప్పింది. అయితే ఇది ముమ్మాటికీ తప్పు అని తెలుస్తుంది.

దాదాపుగా మూడేళ్ళ క్రితం ఐఐఎంకు కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ భూమి పూజ చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం భూమిని సేకరించి దాని చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించి స్థలాన్ని అప్పగించింది. కేవలం కేంద్రం నిధులు ఇవ్వక నిర్మాణం ముందుకు సాగక, ఐఐఎం తరగతులు ఇప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీలోనే జరుగుతున్నాయి.

డజన్ మంది మేధావులు పక్కన ఉన్నా పవన్ కళ్యాణ్ తప్పులో కాలేసినట్టే కనిపిస్తుంది. అయితే బాధ్యతాయుతంగా ఉండాల్సినవారు ఇలాంటి తప్పులు చేస్తే అసలు దోషులు తప్పించుకుంటారు. మరోవైపు ఈ లెక్కల పై కేంద్రం విధానం ఏంటో తెలుసుకోవడానికి జనసేన కమిటీ వారు ఆర్టీఐ ద్వారా కేంద్రాన్ని సమాచారం కోరారు.