Pawan Kalyan Trivikram Srinivas movie titleదాదాపు షూటింగ్ తుది దశకు చేరుకుంటున్నా… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ల సినిమాకు టైటిల్ ను మాత్రం ప్రకటించలేకపోయారు. అయితే షూటింగ్ ప్రారంభమైన సమయంలో హల్చల్ చేసిన “దేవుడే దిగి వస్తే” టైటిల్ నుండి తాజాగా “రాజు వచ్చినాడు” వరకు అనేక టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి గానీ, ఏ ఒక్క టైటిల్ కూడా అభిమానులను, ప్రేక్షకులను అలరించలేకపోయాయి. బహుశా ప్రేక్షకుల ఓటింగ్ కోసం చిత్ర యూనిట్టే ఈ టైటిల్స్ ను లీక్ చేస్తోందో ఏమో గానీ, అసలు పవర్ స్టార్ రేంజ్ కు తగ్గ టైటిల్ ఒక్కటి కూడా తెరపైకి రాకపోవడం విస్మయానికి గురిచేసే విషయం.

మాటలను అద్భుతంగా పండించే త్రివిక్రమ్, టైటిల్ విషయంలో ఎందుకు ఇంత గందరగోళానికి గురవుతున్నారో అర్ధం కాని విషయం. అంతకుముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన “జల్సా” అన్ని వర్గాలకు చేరువ కాగా, ‘అత్తారింటికి దారేది’ టైటిల్ సాఫ్ట్ గా ఉన్నా, సినిమా విడుదలైన తర్వాత కంటెంట్ కు కరెక్ట్ గా ఉండడంతో అదిరిపోయే స్పందన లభించింది. నిజానికి టైటిల్ ప్రకటించినపుడే ‘అత్తారింటికి దారేది’ టైటిల్ వెరైటీగా ఉందన్న టాక్ వెలువడింది. త్రివిక్రమ్ – పవన్ కాంభినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఏమో గానీ, అన్ని ‘దేవుడు, రాజు’ అంటూ బాగా పైకి లేపే టైటిల్స్ పేర్లే వినపడుతున్నాయి.

ఒక్కోసారి అతి జాగ్రత్తకు వెళితే అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందన్న విషయం… మహేష్ తో తెరకెక్కించిన “ఖలేజా” సందర్భంగా త్రివిక్రమ్ రుచిచూసారు. ‘ఖలేజా’ అన్న టైటిల్ చిత్ర షూటింగ్ ప్రారంభమైన నాటి నుండి హల్చల్ చేసింది గానీ, బ్యానర్ లో రిజిస్టర్ చేయకపోవడంతో, అది టైటిల్ ను ఏదో అనామక బ్యానర్ రిజిస్టర్ చేసుకుని, ఆ తర్వాత జరిగిన రచ్చ తెలియనిది కాదు. అలాగే పవన్ ‘కాటమరాయుడు’ టైటిల్ కూడా సప్తగిరి సినిమాకు పెట్టగా, పవన్ అడగడంతో ఇచ్చేసిన వైనం తెలియనిది కాదు. ఇలా టైటిల్స్ ను ముందుగా లీక్ చేస్తే జరిగే ప్రమాదాలు ఇవి కాగా, అసలు ఇవేమీ టైటిల్స్ అంటూ వాపోవడం పవన్ అభిమానుల వంతవుతోంది.