pawan-kalyan-touches-feet-of-a-doctor-in-kakinadaఎన్ని విమర్శలు చేసినా… ఎంతగా ప్రశంసించినా… అది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి సంబంధించే ఉంటుంది. అంతలా తన వ్యవహార తీరుతో ప్రజలను ప్రభావితం చేస్తారు పవన్ కళ్యాణ్. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ తన నిరాడంబరత్వంతో స్థానికంగా ఉన్న ప్రజలను కట్టిపడేస్తున్నారు. కాకినాడలోని కిరణ్ హాస్పిటల్ వైద్యుడు సంకురాత్రి చంద్రశేఖర్ చేస్తున సమాజ సేవలకు పొంగిపోయి, ఏకంగా వెళ్ళిపోయి ఆయన కాళ్ళకు పాదాభివందనం చేసేసారు.

ఊహించని ఈ పరిణామంతో సదరు డాక్టర్ తో సహా అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అయితే ఎలాంటి బేషజాలకు పోకుండా, మనస్పూర్తిగా సంకురాత్రి చంద్రశేఖర్ డాక్టర్ కాళ్ళు మ్రొక్కి అభినందించారు. ఈ సంద‌ర్భంగా కిర‌ణ్ కంటి ఆసుప‌త్రి మొత్తం సంద‌ర్శించిన ప‌వ‌న్… ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లో ఓ మొక్క‌ను కూడా నాటారు. ఆసుపత్రిలో ఓ రోగిని ప‌రామ‌ర్శించిన అనంత‌రం, సంకురాత్రి చంద్రశేఖర్ స‌మాజానికి చేస్తున్న సేవ ఎంతో ప్ర‌శంస‌నీయ‌మైంద‌ని అన్నారు.

భార్యాబిడ్డల్ని కోల్పోయినప్ప‌టికీ సామాజిక బాధ్య‌త‌ను గుండెల్లో నింపుకున్న‌ డాక్టర్ చంద్ర‌శేఖ‌ర్ ఎంతో మంది రోగుల‌కి కంటి చూపునిచ్చార‌ని, ఆయ‌న చేస్తోన్న సేవ ఎంతో స్ఫూర్తిదాయ‌క‌మ‌ని కితాబిచ్చారు. అయితే, ప‌వ‌న్ డాక్ట‌ర్‌కి పాదాభివంద‌నం చేయ‌డాన్ని చూసిన సద‌రు ఆసుపత్రి సిబ్బంది, అక్క‌డే ఉన్న ప‌వ‌న్‌ అభిమానులు మాత్రం ఆ ఘటనను మరిచిపోలేక, చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ ఉదంతం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. డాక్ట‌ర్ ప‌ట్ల పవన్ ప్ర‌ద‌ర్శించిన తీరు ఆయ‌న‌ మానవతాదృక్పథానికి నిదర్శనమని, ఎలాంటి ఈగో లేని వ్యక్తిగా పవన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.