Pawan Kalyan తిరుపతి ఉపఎన్నిక సమీపిస్తోంది. అతి తొందరలో ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటన వచ్చే అవకాశం ఉంది. జనసేన ఈ ఉపఎన్నికలో పోటీ చెయ్యాలని గట్టిగా ప్రయత్నించినా బీజేపీ అందుకు అవకాశం ఇచ్చేలా లేదు. ఈ తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 21న తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

21న సాయంత్రం నగరంలో నిర్వహించనున్న జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) లో పవన్ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పవన్‌తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొంటారు. పలు ముఖ్యమైన అంశాలపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా జనసేన బీజేపీ ఉమ్మడి కార్యక్రమాలు ఏమీ ప్రకటించకపోవడం గమనార్హం. ఇటీవలే కాలంలో పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించడం ఇది రెండో సారి. బీజేపీలా జనసేన కూడా ఎటువంటి సంప్రదింపులు లేకుండా తిరుపతిలో పోటీ చెయ్యబోతున్నాం అని ప్రకటించాలని జనసైనికులు కోరుకుంటున్నారు.

అయితే అటువంటి అవకాశాలు తక్కువే అని చెప్పవచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అకాలమరణంతో తిరుపతిలో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది. ఆయన కుటుంబసభ్యులకు సీటు ఇవ్వకపోయినా తమకు మూడు లక్షల మెజారిటీ ఖాయమని అధికారపక్షం ధీమాగా ఉంది.