Pawan Kalyan to meet Narendra Modi - amit Shahజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ రాజధాని అమరావతిపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో పర్యటించారు. నిడమర్రు, కూరగల్లులో పర్యటించిన ఆయన కొండవీటి వాగు వద్ద వంతెన పనుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని అంశంపై మంత్రులు బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. మంత్రుల ప్రకటనలతో తీవ్ర గందరగోళం నెలకొందన్నారు. రాజధానిలో అవినీతి జరిగితే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రాజధాని విషయాన్ని జనసేన సీరియస్ గా తీసుకోబోతుందని, ప్రస్తుత సమస్యలపైనా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను కలిసే ఆలోచన ఉందన్నారు. సమయం దొరికితే వాళ్లను కలిసి రాష్ట్రంలోని పరిస్థితుల్ని వివరిస్తానన్నారు. చంద్రబాబు హయాంలో ప్రత్యేక హోదాపై ఉద్యమం అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలే చేసారు. ఒక్క సంధర్భంలో ప్రధానిని కలుస్తా అని, ఇంకో సందర్భంలో నేను పదవులలో లేను కాబట్టి కలవలేనని చెప్పుకొచ్చారు.

దీనితో పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాట జరిగినప్పుడు చూడాలి అని సొంత అభిమానులే అనుకునే పరిస్థితి. ఈ విషయంలో అందరి అంచనా తప్పని నిరూపిస్తే పవన్ కళ్యాణ్ క్రెడిబిలిటీ పెరగడంతో పాటు జనసేన భవిష్యత్తు కూడా బావుంటుంది. మరోవైపు గతంలో పవన్ కళ్యాణ్ అమరావతిని వ్యతిరేకించారు అన్న బొత్స వ్యాఖ్యలకు కూడా జనసేనాని కౌంటర్ ఇచ్చారు. రాజధాని భూసేకరణను మాత్రమే తాను అప్పట్లో వ్యతిరేకించానని పవన్‌ గుర్తుచేశారు.