Chiranjeevi pawan kalyanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావడానికి కారణం ఎవరూ అంటే టక్కున చిరంజీవి, సురేఖల పేర్లు చెప్తారు. ఈ విషయాన్ని ఆదివారం జరిగిన ‘సర్ధార్’ ఆడియో వేడుక సందర్భంలో కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ప్రస్తావించారు. తన కెరీర్ ఈ రోజున ఇలా ఉండడానికి కారణం తన అన్నయ్య, వదినలే కారణమని పవన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే తనకు ఇంత కెరీర్ ను అందించిన పవన్ కళ్యాణ్ తన అన్నయ్య ఋణం తీర్చేసుకున్నారన్న విషయాన్ని రామ్ చరణ్ తెలిపారు.

పవన్ ఎలాగైతే అల్లరి చిల్లరిగా తిరుగుతున్న సమయంలో పవన్ కు హితబోధ చేసి కర్తవ్యం గుర్తు చేసారో… అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కు 20 ఏళ్ళ వయసులో హితబోధ చేసాడన్న విషయం హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్ ద్వారా వెలుగు చూసింది. “అల్లరి చిల్లరిగా తిరుగుతున్న తనను పిలిచి ఒక గంటసేపు బాబాయ్ చేసిన హితబోధ, తన కర్తవ్యం ఏమిటో తెలిసేలా చేసిందని, ఆ తర్వాత నుండే నేను సినిమాల్లోకి రావాలని కష్టపడుతున్నానని, తన తండ్రి ఎలా కష్టపడ్డారో, దాన్ని నువ్వు పాటించకపోతే నీ జీవితం వ్యర్ధం” అని బాబాయ్ చెప్పిన మాటలు తనను ఎంతగానో ప్రభావితం చేసాయని చెర్రీ చెప్పుకొచ్చారు.

దీంతో అన్నయ్య తన కెరీర్ కు చేసిన దోహదానికి పవన్ తిరిగి చెర్రీ రూపంలో తీర్చేసుకున్నట్లయ్యింది. అయితే మొన్నటి వరకు ఒకరి పేర్లు ఒకరు పలకడానికి ఇష్టపడని ఈ మెగా కుటుంబీకులు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు ఇలా ప్రశంసలు కురిపించుకోవడం ఏంటన్న అంశం ఆసక్తికరంగా మారింది. ‘సర్ధార్’ ఆడియో వేదికగా మెగా బ్రదర్స్ ఇరువురు పొగడ్తల అగడ్తలతో మునిగి తేలగా, మరో వైపు చెర్రీ కూడా తన బాబాయ్ అంటూ చాలా కాలం తర్వాత పవన్ ను ప్రస్తావిస్తూ ప్రశంసల వర్షం కురిపించడం టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీసింది.