Pawan_Kalyan_Janasenaఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ అధికార వైసీపీతో సహా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికాలు, పొత్తులు, కుల సమీకరణాల గురించి వాదోపవాదాలు చేసుకొంటుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

వచ్చే ఎన్నికలలో వైసీపీ ఒంటరిగా పోటీ చేయబోతోందని ఆ పార్టీ నేతలు చెప్పుకొంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొనే సాహసం ఏ పార్టీకి లేదు కనుక.

ఇక వచ్చే ఎన్నికలలో ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలని టిడిపి కూడా పట్టుదలగా ఉంది. అయితే గత ఎన్నికల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోతే నష్టపోతామని భయపడుతోంది. పవన్ కళ్యాణ్‌ దానినే బలహీనతగా భావించి టిడిపిని ‘తగ్గాలని’ చెపుతున్నట్లు భావించవచ్చు. అయితే గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సహా అందరూ ఓడిపోయిన సంగతి అప్పుడే మరిచిపోయినట్లున్నారు.

తెలంగాణలో జనసేన సుమారు 30 నియోజకవర్గాలలో బలంగా ఉందని వచ్చే ఎన్నికలలో వాటిలో గెలవలేకపోయినా ఇతర పార్టీల గెలుపోటములు నిర్దేశించగలమని ఇటీవలే పవన్ కళ్యాణ్‌ చెప్పారు. కానీ ఏపీలో వాస్తవ రాజకీయ పరిస్థితులు గమనించకుండా ముఖ్యమంత్రి అయిపోదామని కలలుగంటున్న పవన్ కళ్యాణ్‌, వచ్చే ఎన్నికలలో తన పార్టీ ఏపీలో ఎన్ని సీట్లు గెలుచుకోగలదో చెప్పలేకపోతున్నారు.

అయినా టిడిపికి తగ్గాలని కండిషన్ ఎలా పెట్టగలుగుతున్నారంటే బహుశః ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతుందనే టిడిపి భయపడుతోందని భ్రమిస్తునందునే కావచ్చు. అయితే జనసేన తన శక్తిసామర్ధ్యాలు, ప్రత్యర్ధుల బలాబలాలు, కుల సమీకరణాల లెక్కలు వగైరాల గురించి తెలుసుకోకుండా టిడిపి చెయ్యి మెలిపెట్టి ఎక్కువ సీట్లు తీసుకొంటే లాభపడేది జనసేన కాదు… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని గ్రహిస్తే మంచిది.

ఎందుకంటే వైసీపీ, అర్ధబలం, అంగబలం, అధికార బలాన్ని తట్టుకొని నియాలబడగలిగే అభ్యర్ధులు జనసేనలో లేరు కనుక. అప్పుడు జనసేన కోల్పోయే ప్రతీ సీటు కూడా వైసీపీకే దక్కుతాయి. అంటే ముఖ్యమంత్రి అవ్వాలనే తాపత్రయంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి జనసేన పార్టీయే పరోక్షంగా సాయపడినట్లు అవుతుందన్న మాట!

ఇక ఆంధ్రప్రదేశ్‌లో బిజెపికి ప్రజాధారణ లేదనేది బహిరంగ రహస్యమే. ఆ బలహీనత కారణంగానే బిజెపి-జనసేన కూటమికి పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాలని జనసేన నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేస్తున్నారనుకోవచ్చు.

అయితే ఏపీలో జనసేన-బిజెపిలు ఇంచుమించు సమానస్థాయిలో ఉన్నాయి కనుక పవన్ కళ్యాణ్‌ ఆవిదంగా కోరడంలో తప్పు లేదు. ఇక పవన్ కళ్యాణ్‌ను వదులుకోవడం కంటే ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించి కలిసి సాగితే వచ్చే ఎన్నికలలో వారి కూటమి గెలిచి అధికారంలోకి రాలేకపోయినా ఎన్నో కొన్ని సీట్లు అదనంగా గెలుచుకొనే అవకాశం బిజెపికి ఉంటుంది. కనుక ఈ ప్రతిపాదనకు బిజెపి అంగీకరించినా ఆశ్చర్యం లేదు.

కానీ దీనివలన కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి వైసీపీ లాభపడుతుందని వేరే చెప్పక్కరలేదు. కనుక ఈసారి కూడా జనసేన తగ్గడమే చాలా మంచిది. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్‌ కనుక ఆయనే కాస్త తగ్గించుకొంటే తరువాత హెచ్చింపబడి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే అవకాశం లభించవచ్చు.