జనసేన అధినేత గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకొన్నారు. ఈసారి అక్కడ ఆయనకు స్వాగతం చెప్పడానికి జనసైనికులు ఎవరూ రాలేదు! మంగళగిరి పార్టీ కార్యాలయానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఒక్కరే వచ్చి కాసేపు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయంలోనే ఉన్నారని తెలిసినా కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ అటువైపు తొంగిచూడలేదు!!!
కానీ ఓ సర్వే సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు మాత్రం శుక్రవారం మధ్యాహ్నం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉన్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ వెంట ఎవరూ లేకుండా వారితో రహస్యంగా రెండు రోజులు సుదీర్గంగా ఏమి చర్చించారని ఆరా తీస్తే సదరు సర్వే సంస్థకు రాష్ట్రంలో జనసేన పరిస్థితి గురించి సర్వే చేసి తెలుసుకోమని పవన్ కళ్యాణ్ పురమాయించిన్నట్లు, వారితో అదే విషయం మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ మంగళగిరి వచ్చిన్నట్లు తెలిసింది.
Also Read – అప్పుడే ఏపీ పూర్తిగా అభివృద్ధి చెందిన్నట్లు లెక్క!
సదరు సర్వే సంస్థ ప్రతినిధులు రాష్ట్రంలో జనసేన పార్టీ ఎక్కడెక్కడ పార్టీ బలంగా ఉంది. ఎక్కడ బలపడే అవకాశాలున్నాయి. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే మంచిది వంటి కీలక సమాచారాన్ని పవన్ కళ్యాణ్‌కు అందజేసిన్నట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగబాబు, నాదెండ్ల మనోహర్ వంటివారిని కూడా దూరంగా ఉంచి పవన్ కళ్యాణ్ ఒక్కరే సర్వే సంస్థ ప్రతినిధులతో ఏకాంతంగా అంతసేపు మాట్లాడటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఎటువంటి హడావుడి లేకుండా ఇంత రహస్యంగా మంగళగిరికి వచ్చి వెళ్ళిపోవడం ఇదే మొదటిసారి. కనుక జనసేన నేతలు, కార్యకర్తలు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. సర్వే సంస్థ నివేదిక ఇవ్వడం నిజమైతే పవన్ కళ్యాణ్ నేడో రేపో హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి సీట్ల సర్దుబాటు గురించి చర్చించే అవకాశం ఉంది. సీట్ల విషయంలో స్పష్టత వస్తే టిడిపి, జనసేనలో పొత్తుల విషయంలోనూ స్పష్టత వస్తుంది. కనుక త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మళ్ళీ ప్రకంపనలు మొదలయ్యే అవకాశం ఉంది.