jana-sena_pawan-kalyan‘ప్రజా సంక్షేమాలు ఏవైనా అవి ప్రజలకు ప్రయోజనకారిగా ఉన్నంతవరకే’ అన్న నినాదంతో ముందుకెళ్తున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, గతంలో రాజధాని ప్రాంతంలో భూసేకరణ విషయమై అమరావతి గ్రామంలో ఓ బహిరంగ సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గడంతో… నాటి నుండి ఎలాంటి సామాజిక సమస్య తలెత్తినా… ముందుగా పవన్ కళ్యాణ్ ఓ ఆశాదీపంలా కనపడుతున్నారు.

అయితే ఆ క్రమంలోనే మరికొన్ని సమస్యలు పవన్ కళ్యాణ్ తలుపు తట్టినప్పటికీ, వేచిచూసే ధోరణిలో ఉన్న ‘జనసేన’ అధినేతకు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఒక సమస్యను విన్నవించుకున్నారు. జిల్లాలో రానున్న మెగా ఆక్వాఫుడ్ పార్క్ వల్ల 30 గ్రామాలు తీవ్ర కాలుష్యానికి గురవుతాయని, 30 గ్రామాల ప్రజల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలో తమకు తెలియడం లేదని, మీరే సాయం చేయాలని వారు పవన్ కల్యాణ్ ను కోరారు.

“అభివృద్ధి ఎంత ముఖ్యమో, ప్రజా సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యమని” ఈ సందర్భంగా మెగా ఆక్వాఫుడ్ పార్క్ బాధిత గ్రామాల ప్రజలనుద్దేశించి పవన్ మాట్లాడారు. ఫుడ్ పార్క్ సమస్యపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో తానూ మాట్లాడతానని, పారిశ్రామికాభివృద్ధికి ‘జనసేన’ పెద్దపీట వేస్తుందని అన్నారు. అయితే ప్రభుత్వాలు చేసే అభివృద్ధి కారణంగా ప్రజలు పురోగతి చెందాలే గానీ, భయంతో బతకకూడదని పేర్కొన్నారు. పవన్ రంగప్రవేశంతో ‘మెగా ఫుడ్ పార్క్’ భవిష్యత్తు ఏమిటోనన్న ఆసక్తి రెండు వర్గాల్లోనూ నెలకొంది.