pawan-kalyan-chiru-kapu-supportప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలను తన నుండి ఆశిస్తున్నారా? అంటూ మీడియా వర్గాలను నేరుగా ప్రశ్నించిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్… భావోద్వేగాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయాలకు తానూ దూరం అంటూ స్పష్టమైన ప్రకటన జారీ చేసారు. ఏం చేసినా… ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు (ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా) చేయాలన్నది తన అభిమతమని, ఆ బాధ్యతను ప్రజలు వారికి అప్పగించారు కనుక, వారు మాత్రమే పోరాటం చేయాలని, ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనకూడదన్నది అణా అంతరార్ధంగా పవన్ చెప్పుకొచ్చిన వైనం తెలిసిందే.

ఓ పక్కన ‘తమ్ముడు’ ఇలా నీతిసూక్తులు చెప్తూ… ప్రజాశ్రేయస్సును ఆకాంక్షిస్తుంటే… మరో వైపు ‘అన్నయ్య’ చిరంజీవి ‘కులసూక్తులు’ చెప్పడానికి సిద్ధం కావడం విశేషం. ఏ విధంగా అయితే భావోద్వేగాలను రెచ్చగొట్టే విధానాలకు దూరం అని పవన్ అన్నారో… సరిగ్గా దానికి పూర్తి వ్యతిరేకంగా… ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకుంటూ ముద్రగడ నేతృత్వంలో సాగుతున్న ‘కాపు ఉద్యమం’లో చిరంజీవి కూడా భాగస్వామి కావడం విశేషం. తాజాగా రాజమహేంద్రవరంలో భవిష్యత్తు కార్యాచరణ నిమిత్తం ప్రముఖ కాపు నేతలంతా హాజరవుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవికి తోడు, దాసరి నారాయణరావు, ఇతర కాపు నేతలు, మాజీ అధికారులు హాజరు కానున్న ఈ భేటీలో ఉద్యమ నేత ముద్రగడ చేయబోతున్న కార్యాచరణ గురించి చర్చలు జరపనున్నారు. రాజకీయంగా ప్రాధాన్యత దక్కించుకున్న ఈ కాపు జేఏసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోందో మరికొద్ది గంటల్లో తేలనుంది. కాపులతో పాటు తెలగ, బలిజ, ఒంటరి తదితర కులాలను కూడా బీసీల్లో చేర్చాలన్నది ప్రధానమైన డిమాండ్ అన్న సంగతి తెలిసిందే.