Pawan Kalyanవిశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం చిచ్చు రేపుతోంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖవాసులు, కార్మిక సంఘాలు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం మరోసారి బీజేపీ మెడకు చుట్టుకుంది. అయితే ఏపీలో తమ మిత్రపక్షం, జనసేన ద్వారా ఈ వివాదాన్ని చల్లబరచాలని బీజేపీ అధిష్టానం యోచిస్తున్నట్టు సమాచారం.

విశాఖ ఎన్నికల తంతు పూర్తి అయ్యాకా పవన్ కళ్యాణ్ పూర్తిగా ప్రభుత్వం లైన్ తీసుకుని ప్రజల మనసులు మార్చాలని బీజేపీ అధిష్టానం జనసేనాని ని కోరిందట. అందుకు తగ్గట్టుగానే ఇప్పటికే పవన్ కళ్యాణ్ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా పలు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్నదే తప్ప కేవలం వైజాగ్ స్టీల్ స్టీల్ ప్లాంటును మాత్రమే దృష్టిలో పెట్టుకొని తీసుకున్నది కాదని ఆయన తెలిపారు.

దేశం కోసం తీసుకున్న నిర్ణయం అనడంతోనే పవన్ కళ్యాణ్ బీజేపీ లైన్ తీసుకున్నారని అర్ధం అవుతుంది. అయితే ఇటువంటి వైఖరి జనసేన పార్టీ కొంపముంచడం ఖాయమని ఆ పార్టీ వారే అభిప్రాయపడుతున్నారు. గతంలో రాష్ట్ర విభజన సమయంలో చిరంజీవి కేంద్ర మంత్రిగా ఉన్నారు. విభజనను వ్యతిరేకిస్తూ.. ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి.. కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి పోరాటం చేసి ఉంటే.. ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండేది.

చిరంజీవి రాష్ట్ర విభజనను వ్యతిరేకించినా.. మరో ముందడుగు వేయలేకపోయారు. ఫలితంగా రాజకీయంగా అంతం అయిపోయారు. కానీ పవన్ మాత్రం పాతికేళ్లు రాజకీయాల్లో ఉండటానికి వచ్చానని చెబుతూ స్వల్ప రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ అడుగులకు మడుగులు ఒత్తితే రాజకీయంగా ఇబ్బంది పడాల్సి రావొచ్చు. పవన్ దానిని ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.