pawan-kalyan-speech-in-anantapurతనపై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, తాను దేనిని పట్టించుకోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు నాయకులందరితో పరిచయాలు ఉన్నాయని… తనకు ఎవరితో శత్రుత్వం లేదని చెప్పారు. సమస్యల సాధన కోసం తాను పని చేస్తానని, ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని అన్నారు.

రాయలసీమ వ్యాప్తంగా సమస్యలు ఉన్న ప్రాంతాల్లో వ్యక్తిగతంగా పర్యటిస్తానని, ఆ తర్వాత మేధావులతో చర్చించి, సమస్యలకు పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తానని తెలిపారు. సమస్యల పరిష్కార సాధన కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లను కూడా కలుస్తానని చెప్పారు. మన పోరాటం కేవలం 2019 కోసం మాత్రమే కాదని… 25 ఏళ్లపాటు కొనసాగే పోరాటమని తెలిపారు.

అనంతపురం, గుత్తి రోడ్డులో వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల మధ్య జనసేన కార్యాలయానికి భూమి పూజ చేసిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. రాయలసీమ అంటే అందరికీ ఫ్యాక్షనిజం కనిపిస్తుందని… తనకు మాత్రం ఒక తరిమెల నాగిరెడ్డి, ఒక నీలం సంజీవరెడ్డి, మానవత్వం కలిగిన మనుషులు కనిపిస్తారని చెప్పారు. ఆవేశంతోనో, మీతో చప్పట్లు కొట్టించుకోవడానికో తాను ఈ మాటలు చెప్పడం లేదని తుది శ్వాస వరకు రాయలసీమకు అండగా ఉంటానని అన్నారు.

రాయలసీమకు ఎలాంటి సమస్యలు ఉన్నా పాలకులతో మాట్లాడి, సానుకూలంగా పరిష్కరిస్తానని చెప్పారు. సినిమాల కంటే ప్రజాసేవలోనే తనకు ఎక్కువ తృప్తి ఉందని, రైతుల కష్టాలు, యువత ఆశయాలు తనకు తెలుసని చెప్పారు. తాను యువత భవిష్యత్తు కోసమే వచ్చానని, కుల, మత, ఓటు బ్యాంకు రాజకీయాలు తాను చేయబోనని చెప్పారు. 2019 ఎన్నికల్లో యువత ఏం చేయబోతోంది, ఎలాంటి మార్పు కోరుకోబోతోంది అనే విషయాన్ని అందరికీ తెలియజేద్దామని అన్నారు.