Pawan_Kalyan_Speech_Yuva_Shakthపవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలలోకి ప్రవేశించినప్పుడు అసందర్భ ప్రసంగాలు చేసేవారు. దాని వలన ఆయన సభలు వృధా అవుతుండేవి. ఆ ఆ ప్రసంగాలు విని ప్రజలు కూడా ఆయనని తక్కువగా అంచనా వేస్తూ పెద్దగా పట్టించుకొనేవారు కారు. అందుకే పవన్ సభలకి భారీగా జనాలు వచ్చి చప్పట్లు కొట్టినా వారి అభిమానం అక్కడికే పరిమితమైపోయేది. జనసేనకి ఓట్లు రాలలేదు.

కానీ పవన్ ఇప్పుడు మంచి రాజకీయ పరిణతితో మాట్లాడుతున్నారు. కనుక ఆయన చెప్పే మాటలు సరిగ్గానే ప్రజలకి చేరుతున్నాయని చెప్పవచ్చు. నిన్న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి సభలో పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగమే ఇందుకు తాజా ఉదాహరణ.

ఆయన ప్రసంగంలో అధికార పార్టీ దురాగతాలని వివరించి ఇటువంటి ప్రభుత్వం, పాలకులు మనకి అవసరమా?అని ప్రశ్నిస్తూ ప్రభుత్వ విధానాలు, నిరంకుశ, అప్రజాస్వామ్య వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు ముక్కల ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని మళ్ళీ విడగొట్టలంటున్న మంత్రి ఒకరు, డప్పు కొట్టే సలహాదారులు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడి అందరూ కలిసి ఉత్తరాంద్రని అప్పడంలా నమిలేయాలని చూస్తున్నారంటూ పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు.

టిడిపితో పొత్తులపై వైసీపీ దుష్ప్రచారానికి ధీటుగా సమాధానమిస్తూ, ఇంట్లో వారితోనో లేదా ఇరుగుపొరుగువారితోనో గొడవ పడితే వారికి శాస్వితంగా దూరం కానట్లే, రాష్ట్ర భవిష్యత్ కోసం గొడవ పడిన టిడిపితో కలిసిపనిచేసేందుకు సిద్దపడుతున్నానని పవన్‌ కళ్యాణ్‌ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలలో జనసేన ఒంటరిగా బరిలోకి దిగి ‘వీరమరణం’ పొందాల్సిన అవసరం లేదు కనుక పార్టీని, రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు పొత్తులకి సిద్దపడుతున్నానని చెప్పారు. అయితే టిడిపితో పొత్తులు గౌరవప్రదంగా ఉండాలని ఆశిస్తున్నామని చెప్పారు.

తన పార్టీని నడిపించుకోవడం కోసమే తాను సినిమాలు చేయాల్సివస్తోందని, ఆ డబ్బుతోనే పార్టీని, కార్యక్రమాలని నిర్వహించుకొంటున్నానని చెప్పారు. తద్వారా వీకెండ్ పొలిటీషియన్ అంటూ ఎద్దేవా చేస్తున్న మంత్రి ఆర్‌కె. రోజా వంటివారికి పవన్‌ కళ్యాణ్‌ ఘాటుగా జవాబిచ్చారు.

గత ఎన్నికలలో తన ఓటమి, పార్టీ ఓటమిని యుద్ధ గాయాలుగా భావించి వాటి నుంచి కోలుకొని మళ్ళీ వచ్చే ఎన్నికలలో పోరాడేందుకు సిద్దం అవుతున్నానని అన్నారు. గెలిచినా, ఓడినా ప్రజలతోనే ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికలలో జనసేన లేదా సంకీర్ణ ప్రభుత్వం ఏది అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో పేరుకుపోయిన సమస్యలని పరిష్కరిస్తామని, అవినీతి, అక్రమాలకి, దౌర్జన్యాలకి పాల్పడినవారినందరినీ శిక్షిస్తామని, రాష్ట్రాభివృద్ధికి గట్టిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సభాముఖంగా ఇస్తున్న ఈ హామీలన్నిటికీ తాను కట్టుబడి ఉంటానని వాటిని అమలయ్యేలా చేసే బాధ్యత తనదే అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. వచ్చే ఎన్నికలలో ప్రజలందరూ ఆలోచించి ఓట్లు వేయాలని లేకుంటే మరో 5 ఏళ్ళు బాధలు పడాల్సి ఉంటుందని రాష్ట్రాభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుందని పవన్‌ కళ్యాణ్‌ సున్నితంగా ప్రజలని హెచ్చరించారు.