pawan kalyan speech at Republic pre release eventనా జోలికి వస్తే ఊరుకుంటానేమో… చిత్ర పరిశ్రమ జోలికి వస్తే తాట తీస్తా అంటూ హైదరాబాద్ నుండే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గంట పాటు అనర్గళంగా మాట్లాడిన ఆయన గుక్క తిప్పుకోకుండా ప్రభుత్వ పెద్దలు కడిగిపారేశారు.

అంతటితో ఆగకుండా మంత్రి పేర్ని నానిని సన్నాసి అని, ముఖ్యమంత్రిని క్రిమినల్ పొలిటిషన్ అని కూడా అనేశారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన ప్రతీ మాటా నిజమే.. ఇండస్ట్రీలోని ప్రతీ ఒక్కరి మదిలో ఉన్నదే అయితే దీని పర్యవసానాలు మాత్రం తీవ్రంగా ఉండబోతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు.

దీనికి ప్రతిగా ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడటం ఖాయమని… 100% ఆకుపెన్సీ, నైట్ షోస్, టిక్కెట్ రేట్లు వంటివి ఇప్పట్లో జరగనివ్వరని పరిశ్రమకు మునుముందు ఇబ్బందులు తప్పవని పరిశ్రమకు చెందిన వారు భావిస్తున్నారు. అయితే ఇప్పుడు పరిశ్రమ ముందు మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయి.

ఒకటి ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ని దూరం పెట్టి.. ఆయనను దూషించి ప్రభుత్వ పెద్దలను మెప్పించి వారి కరుణకు పాత్రులు కావాలి. అయితే మెగా కుటుంబం జోలికి ఇండస్ట్రీలో వెళ్లడం అంటే అంత తేలికైన విషయం కాదు. పైగా పవన్ మాట్లాడింది పరిశ్రమ తరపున.

ఇంకో ఆప్షన్.. పూర్తిగా పవన్ సైడ్ తీసుకుని ప్రభుత్వం మీద ఎదురుదాడి చెయ్యడం. అలా చేస్తే… ఈ విషయం సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వం నుండి కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఇక మూడో ఆప్షన్ తటస్థంగా ఉండిపోయి… ఏదో రకంగా ఈ పరిస్థితి నుండి బయటపడేయాలని దేవుడిని కోరుకోవడం.

మొదటి ఆప్షన్ తప్ప ఏ ఆప్షన్ తీసుకున్నా… ప్రస్తుతం ఉన్న సమస్యలకు తొందరగా పరిష్కారం దొరకదు. ” ఆయన మాట్లాడిన కరెక్టే… కానీ పవన్ కళ్యాణ్ ని ముంచేస్తేనే ఇండస్ట్రీ మనుగడ,” అని ఒక నిర్మాత ఒక ఫిల్మ్ ఈవెంట్ లో మీడియాతో ఆఫ్ ది రికార్డు గా అనడం గమనార్హం.