pawan kalyan speech at kadapa Rythu Bhrosa Yatraజనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ శనివారం కౌలురైతు భరోసా యాత్రలో భాగంగా కడప జిల్లాలోని సిద్ధవటంలో పర్యటించి 173 మంది బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు చొప్పున మొత్తం రూ.1.73 కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిద్దవటంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్‌ కళ్యాణ్‌ ప్రజలను ఉద్దేశ్యించిన చేసిన ప్రసంగంలో ఆయన నిజాయితీని, రాష్ట్రం పరిస్థితి పట్ల మనసులోని ఆవేదనను, సిఎం జగన్ దురహంకారం పట్ల ఆగ్రహం చాలా స్పష్టంగా కనబడ్డాయి.

సిద్ధవటం ప్రకృతి రమణీయను చూసి పరవశించిపోయిన పవన్‌ కళ్యాణ్‌ ‘నేను ఇటువంటి చక్కటి ప్రదేశంలో పుట్టి ఉంటే ఎంతబాగుండునో కదా? అన్నారు. ఇంత చక్కటి ప్రకృతి అందాలకు నెలవైన సిద్దవటం మనకి ఉన్నా పర్యాటక ప్రాంతంగా ఉపయోగించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

“ఇక్కడ కౌలురైతుల కుటుంబాలకు జనసేన తరపున చేస్తున్న ఈ చిన్న ఆర్ధికసాయంతో మీ జీవితాలు మారిపోవని మాకు తెలుసు. కానీ కష్టాలలో ఉన్న మీ గురించి సమాజంలో ఆలోచించేవారున్నారని భరోసా కల్పించడానికే ఈ చిన్న ప్రయత్నం,” అని పవన్‌ కళ్యాణ్‌ చెప్పడం అందరి మనసులను తాకింది.

“ఆనాడు మా అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా ఉండి ఉంటే నేడు రాష్ట్రంలో ఇటువంటి అరాచక రాజకీయ పరిస్థితులు ఉండేవే కావు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసినవారందరూ నేడు వైసీపీ పంచన చేరి మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. తెలుగు ప్రజలందరూ ఎంతగానో అభిమానించే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావలసిన వ్యక్తి చిరంజీవి చేత చేతులు జోడించి ప్రాధేయపడేలా చేసిన సిఎం జగన్మోహన్ రెడ్డి అహంకారాన్ని ఏమనుకోవాలి?నమస్కారం చేస్తే ప్రతినమస్కారం కూడా చేయని వ్యక్తి మన ముఖ్యమంత్రి. చిరంజీవి అంతటి ప్రముఖుడికే అటువంటి దుస్థితి కల్పించినప్పుడు ఇక రాష్ట్రంలో సామాన్య వ్యక్తుల పరిస్థితి ఏవిదంగా ఉంటుంది?అందరూ ఆలోచించుకోవాలి,” అని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

ఆయన మాటలలో తన సోదరుడిపట్ల అవ్యాజ్యమైన ప్రేమాభిమానాలు, తన అన్నకు ఎదురైన అవమానం పట్ల ఇంతకాలంగా మనసులో దాచుకొన్న బాధ చాలా స్పష్టంగా వినబడింది.

రాయలసీమ నుంచి చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. వారందరూ బాగుపడ్డారు కానీ నేటికీ ప్రజల పరిస్థితి అలాగే ఉందని పవన్‌ కళ్యాణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ఒక అవకాశమిస్తే రాయలసీమవాసులందరూ తలెత్తుకొని జీవించేలా చేస్తాం. మూడేళ్ళ వైసీపీ పాలనలో భ్రష్టు పట్టుపోయిన వ్యవస్థలన్నిటినీ బలోపేతం చేసి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెడతామని పవన్‌ కళ్యాణ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.