జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలుగు దేశం ఆరోపిస్తున్నట్టుగానే కేంద్ర ప్రభుత్వంపై ఎందుకనో మెతకగానే వ్యవహరిస్తున్నారు. నిన్న జనసేన పోరాట యాత్రలో మాట్లాడుతూ “‘ప్రధాని నరేంద్రమోదీ గారూ.. జనసైనికుల సాక్షిగా.. కష్టజీవులు, ఆడపడుచుల సాక్షిగా మిమ్మల్ని అడుగుతున్నాం. తిరుపతి సభలోనూ మీరు మాటిచ్చారు. వెనక్కి తీసుకోవడానికి లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉంది’ అని పేర్కొన్నారు.
“ప్రధానికి ఒక్కటే చెబుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పునకు ప్రజలకు శిక్ష విధించకండి. సవినయంగా మీకు ఈ విషయం తెలియజేసుకుంటున్నా” అని పేర్కొన్నారు. ఒకప్పుడు కేంద్రం మీద పోరాటం చెయ్యాలి. మన ఎంపీల ఆత్మగౌరవం చచ్చిందా అని అడిగిన పవన్ కళ్యాణేనా ఇప్పుడు ఇలా ప్రధానిని అభ్యర్ధించేది.
అసలు రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పునకు ప్రజలకు శిక్ష విధించకండి అనడం ఏంటి? అసలు ఈ విషయంలో రాష్ట్రప్రభుత్వం చేసిన తప్పేంటి? ఒకవేళ నిజంగా రాష్ట్రప్రభుత్వం ఏమన్నా తప్పు చేసినా అది ఏ విధంగా కేంద్రం చేసిన వాగ్ధానాలను తప్పించుకోవడానికి హక్కును ఇచ్చినట్టు? ఒకరకంగా కేంద్రం తప్పును రాష్ట్రప్రభుత్వం మీదకు నెట్టేసే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నారా?