Pawan Kalyan_ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. టీడీపీ సైతం కేంద్రం మీద ఒత్తిడి పెంచడం మొదలు పెట్టింది. మరో వైపు బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు మొండి చెయ్యి చూపడంతో అక్కడి ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వ్యూహాత్మక మౌనం పేరుతో చంద్రబాబు తెరవెనుక ఉండిపోతున్నారు.

కేంద్రంతో ఎందుకొచ్చిన గొడవలే అని జగన్ మోడీని అనకుండా చంద్రబాబుని నిందిస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ మాత్రం అసలు కనిపించడమే మానేశారు. ఉన్నఫళంగా మాయం అయిపోవడం పవన్ కళ్యాణ్ కు కొత్తేమి కాదు. అయితే ఆయన జనసేన తరపున పత్రికా ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు.

మొన్న రాయలసీమ కరువుకు సంబంధించి నివేదిక తయారు అవుతుందని, తొందర్లో ప్రత్యేక రైలు వేసి రైతులను ప్రధాని దగ్గరకు తీసుకుని వెళ్తా అని చెప్పుకొచ్చారు. నిన్న కడియం నర్సరీల యజమానులు కలిసి వారిని రైతులుగా గుర్తిస్తూ ఉచిత విద్యుత్తు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు.

అయితే ఇప్పటిదాకా బడ్జెట్ మీద స్పందించడానికి మాత్రం టైం దొరకలేదు ఆయనకు. బడ్జెట్ లాంటి చాలా ప్రముఖమైన విషయంపై స్పందించక పవన్ కళ్యాణ్ ను ఎవరు మాత్రం సీరియస్ రాజకీయ నాయుకుడిగా భావిస్తారు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నాడట!