Pawan -Kalyan silent on narendra modi visitప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిన్న గుంటూరు పర్యటన సంధర్భంగా నిరసనలు మిన్నంటాయి. ప్రధానిని వ్యతిరేకిస్తూ టీడీపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు రాష్ట్రంలోని అన్ని చోట్లా నిరసనలు చేశారు. అయితే ఈ నిరసనల నుండి జనసేన, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా దూరంగా ఉన్నాయి. జగన్ ప్రధాని మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోగా యాత్ర సినిమా రివ్యూ పెట్టారు ట్విట్టర్ లో. పవన్ కళ్యాణ్ అయితే మొత్తానికి మాయం అయిపోయారు. పార్టీ కార్యక్రమాలకే పరిమితం అయ్యారు.

టీవీ ఛానల్ డిబేట్లకు హాజరయ్యే జనసేన నాయకులు దీనిపై నీళ్లు నమిలారు. ఒక ఛానల్ డిబేట్ కు వచ్చిన అధికార ప్రతినిధి అద్దేపల్లి శ్రీధర్ అయితే మొత్తానికి ఏం మాట్లాడారో కూడా అర్ధం లేకుండా మాట్లాడారు. ప్రత్యేక హోదా మీద పోరాడింది ఒక్క జనసేన మాత్రమేనని, దీనిపై తమను ఎవరూ విమర్శించలేరని, టీడీపీ అప్పుడు బీజేపీతో అంటకాగి ఎన్నికల ముందు డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. జనసేన ఎందుకు దూరంగా ఉందనేది మాత్రం చెప్పలేదు.

మరో సారి గుచ్చి గుచ్చి అడగగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదని, ఎవరికైనా ఎక్కడికైనా మీటింగు పెట్టుకునే హక్కు ఉంటుందని దానిని గౌరవించే సంస్కృతి జనసేనది అని చెప్పుకొచ్చారు. శాంతియుతంగానైనా నిరసన తెలపాలి కదా అని అడిగిన దానికి కూడా ఆయన దాటవేశారు. దీక్షలకు ప్రజాధనం ఖర్చుపెడుతున్నారని విమర్శించారు. దీని బట్టి పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీ డిఫెన్స్ లో పడిందని క్లియర్ గా కనిపిస్తుంది.

శ్రీధర్ వంటి గట్టిగా మాట్లాడే వారు కూడా పార్టీని సమర్ధించుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఒకప్పుడు ప్రత్యేక ప్యాకేజీ అంటే రెండు పాచిపోయిన లడ్డులు అని విమర్శించిన పవన్ కళ్యాణ్, ఒక సమయంలో ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్పిన ఆయన, వైజాగ్ లో ఇన్వెస్టరు మీటింగ్ జరుగుతున్నప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం నిరసన అంటూ యువత ను రెచ్చగొట్టి ఈరోజు ప్రధాని వచ్చినా కనీసం ఒక్క మాట మాట్లాడలేదు అంటే బీజేపీ ఆయనకు రెండు లడ్డులు ఇచ్చి పవన్ కళ్యాణ్ నోరు మూయించారు అని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు.