Pawan Kalyan silence on amaravati farmers after bjp allianceజనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతిలోని రైతుల పక్షాన పోరాడతానని ప్రకటించి రాజధాని గ్రామాలలో రెండు రోజులు పర్యటించి మమ అనిపించారు. ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లడంతో అక్కడ ఏదో చక్రం తిప్పి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆపుతారని రైతులు గంపెడు ఆశలు పెట్టుకుంటే పవన్ మాత్రం పొత్తు పెట్టుకుని వచ్చారు.

సరే పొత్తు తరువాతైనా తమను పట్టించుకుంటారంటే ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఇప్పుడు ఉన్నట్టుండి సోమవారం సాయంత్రం జనసేన పి.ఏ.సి.అత్యవసర సమావేశం అని ప్రకటించారు. అమరావతిపై శాసనసభ సమావేశాల గురించి, బీజేపీతో ఎలా కలిసి పని చెయ్యాలి అనేదాని గురించి చర్చిస్తారట.

సోమవారం శాసనసభ సమావేశాలు మొదలవుతాయి. ఆ రోజే సభలో సీఆర్దీఏ చట్టాన్ని రద్దు చెయ్యడానికి బిల్లుని ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి సంఖ్య ఉంది కాబట్టి అది పాస్ అవుతుంది కూడా. టీడీపీకి మెజారిటీ ఉన్న మండలికి బిల్లు వెళ్ళకుండా దానిని మనీ బిల్లుగా ప్రవేశపెట్టే ఆలోచన చేస్తుంది ప్రభుత్వం.

అదే గనుక జరిగితే సోమవారం సాయంత్రానికి అంతా అయిపోతుంది. అప్పుడు జనసేన అత్యవసర మీటింగ్ పెట్టుకుని చేసేది ఏముంది? అంతా అయిపోయాకా మీటింగ్లు పెట్టి ప్రజలు తమకు చిత్తశుద్ధి ఉంది అని అనుకోవాలంటే ఎలా? ఇది పవన్ కళ్యాణ్ ని సమర్ధించే వారికి కూడా అంతుచిక్కని ప్రశ్న.