Pawan kalyan serious on KCRతెలంగాణాలో అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం సినీ రంగానికి అండగా ఉంటామని, మరింత అభివృద్ధి చెందేలా, షూటింగ్ లకు అడ్డాగా నిలిచేలా మరిన్ని స్టూడియో నిర్మాణాలను ప్రోత్సహిస్తామని పలు సందర్భాలలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి మాటలు వినడానికే కానీ ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదనే భావనలో ప్రస్తుతం పవర్ స్టార్ అభిమానులు ఉన్నారు.

పవన్ తాజా చిత్రం “సర్ధార్ గబ్బర్ సింగ్” ఆడియో వేడుకను బహిరంగ ప్రదేశంలో అత్యంత వైభవంగా జరపాలని భావించిన విషయం తెలిసిందే. అశేష ప్రజానీకం పట్టే గచ్చిబౌళి స్టేడియం గానీ, నిజాం కాలేజీ గ్రౌండ్ లో గానీ తమకు అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసిన దానిపై కేసీఆర్ సర్కార్ నో చెప్పిందట. సదరు ప్రాంతాల్లో బహిరంగ వేడుకలు జరిగితే ‘లా అండ్ ఆర్డర్’ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కారణంగా చెప్పడంతోనే వెన్యూ హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ కు షిఫ్ట్ చేసారట.

అయితే ఈ విషయంపై పవన్ కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినీ వేడుకలకు ‘లా అండ్ ఆర్డర్’కు సంబంధమేమిటని సన్నిహితుల వద్ద వాపోయినట్లు, అనుమతులు ఇవ్వకపోవడంపై నిరుత్సాహంతో ఉన్నట్లు మీడియా వేదికలుగా వార్తలు వచ్చాయి. దీంతో తమ అభిమాన హీరో సినిమా వేడుకలకు అనుమతులు ఇవ్వలేదా… అంటూ పవన్ అభిమానులు కూడా ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో మరో రెండు రోజుల్లో జరగబోయే ఆడియో వేడుకపై స్పష్టత వచ్చే అవకాశముంది.