Pawan Kalyan sayas jana sena ready for early electionsతెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ‘ముందస్తు’ ఎన్నికల మాటపై ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. అన్ని రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనలతో 2018లోనే ఎన్నికలు రావచ్చన్న సంకేతాలను వ్యక్తపరిచిన చంద్రబాబు, తన క్యాడర్ ను అందుకు తగిన విధంగా సిద్ధంగా ఉండాలని సూచనలు చేసారు. అయితే ఇది టిడిపి క్యాడర్ కేమో గానీ, ‘జనసేన’ అధినేతకు మాత్రం బాగా తగిలినట్లుంది.

దీంతో తాజాగా వేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గత ఎన్నికలలో బరిలోకి దిగకుండా బయట నుండి టిడిపి – బిజెపిలకు సహకారం అందించిన పవన్ కళ్యాణ్, ఈ సారి మాత్రం ‘సమరమే’ అంటున్నారు. “ఎన్నికల యుద్ధం ఒకవేళ ముందుగా వస్తే జన‘సేన’ సిద్ధమే” అంటూ ట్వీట్ చేయడం… పవన్ అభిమానుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, రాజకీయంగానూ హాట్ టాపిక్ గా మారింది. అంటే ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ నిరీక్షిస్తున్న సంకేతాలు ఈ ట్వీట్ ద్వారా వెళ్ళడంతో, జనసేనలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉందన్న నమ్మకం వెళ్ళింది.

అయితే మరో వైపు దీనిపై వైసీపీ వర్గం ‘సైలెంట్’గా ఉండడం విస్మయాన్ని కలిగిస్తోంది. మొన్నటివరకు దమ్ముంటే ఎన్నికలకు రండి… అంటూ ఛాలెంజ్ లు విసిరిన జగన్, స్వయంగా ముఖ్యమంత్రి నోట నుండే ముందస్తు ఎన్నికల మాట వస్తే, దానిపై అభిప్రాయం చెప్పకపోవడంతో, మానసికంగా వైసీపీ ఎన్నికలకు సిద్ధంగా లేదన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. అంటే ఇప్పటివరకు చేసినవన్నీ ‘మేకపోతు గాంభీర్యాలేనని’ ప్రజలకు అవగతమయ్యే పరిస్థితి నెలకొంది. వచ్చే ఎన్నికల్లో పవన్ బరిలోకి దిగడం ఏ పార్టీ నష్టం చేకూరుస్తుందో ఇప్పుడే చెప్పలేం గానీ, ప్రస్తుతం చేసిన ట్వీట్ మాత్రం, వైసీపీ వర్గాలను వెనక్కి నెట్టింది.