janasena warning to jaganతనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ని కలిసి ఇసుక కొరత వాళ్ళ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గురించి ఆయన దృష్టికి తీసుకొచ్చి ఆ తరువాత మీడియా తో మాట్లాడారు పవన్ కళ్యాణ్.

“మాట్లాడితే మూడు పెళ్లిళ్లు.. మూడు పెళ్లిళ్లు అంటారేంటి? కావాలంటే మీరు కూడా చేసుకోండి. ఎవరు కాదన్నారు? నేనేమి సరదా పడి పెళ్లిళ్లు చేసుకోలేదు నాకు కుదర్లేదంతే. మర్యాద మర్చిపోయి మాట్లాడితే మేము మాట్లాడగలం,” అని పవన్ కళ్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

“నా పెళ్లిళ్ల వల్లే మీరు జైలు కు వెళ్ళారా? నా పెళ్లిళ్ల వల్లే విజయసాయి రెడ్డి గారు సూట్ కేసు కంపెనీలు పెట్టి మిమ్మల్ని ఆయనని కలిపి రెండు సంవత్సరాలుగా జైలులో పెట్టింది?,” అని ప్రశ్నించారు. “మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా నేను విషయాల మీదే మాట్లాడుతున్నా. మీరు హద్దు దాటితే మేము కూడా మాట్లాడగలం,” అని హెచ్చరించారు.

ఇసుక దొరక్క నిర్మాణ రంగం కుదేలైందని, వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు భాషా సంస్కారాన్ని మరిచి మాట్లాడినా.. తాము పాలసీ పరంగానే మాట్లాడుతామని పవన్‌ చెప్పారు. వైసీపీ నేతలు సమస్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. గెలుపోటములు తమకు తెలియదని, ప్రజా సమస్యల కోసం పోరాడటమే తమకు తెలుసన్నారు.