Power Star Pawan Kalyan maniaప్రస్తుతం ఎక్కడ చూసినా… ఎక్కడ విన్నా… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా నామజపమే వినపడుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో సంచలనమైన వార్త ఏమిటంటే… తొలిసారిగా ఒక తెలుగు సినిమా దాదాపు 40 దేశాలలో విడుదల అవుతోంది.

ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ ను రికార్డు స్థాయిలో జరుపుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సాధారణంగా యుఎస్, యుకే, గల్ఫ్, ఆస్ట్రేలియా వంటి దేశాలలో తెలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ, “సర్ధార్ గబ్బర్ సింగ్” సినిమా బిజినెస్ మాత్రం ఈ దేశాలతో పాటు ఆఫ్రికన్ మరియు యూరోపియన్ ఖండాలకు కూడా విస్తరించింది.

ఆఫ్రికన్ విభాగంలో… దక్షిణాఫ్రికా, జాంబియా, టాంజానియా, ఎతియోపియా, ఉగాండా, కెన్యా, నైజీరియా ప్రాంతాలలో విడుదల కానుండగా, మిడిల్ ఈస్ట్ లో యుఏఈ, కువైట్, మస్కట్, బహ్రయిన్, ఈజిప్ట్, లెబనాన్, ఇరాక్, జోర్డాన్ వంటి ప్రాంతాలలో విడుదల అవుతోంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లకు తోడు ఆసియాలోని సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, నేపాల్, జపాన్ దేశాలలోనూ ‘సర్ధార్’ సత్తా చాటడానికి ఊవ్విళ్ళూరుతున్నారు.

అలాగే, యూరోప్ లో జర్మనీ, స్విట్జర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్, డెన్మార్క్, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, ఉక్రెయిన్, ఆస్ట్రియా, ఐర్లాండ్, యుకేలలో సందడి చేయనుండగా, నార్త్ అమెరికాలో యుఎస్ఏ మరియు కెనడా దేశాలలో “సర్ధార్” రాక కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇన్ని దేశాలలో విడుదల కానున్న తొలి తెలుగు చిత్రంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కావడం పట్ల అభిమానులు సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తున్నారు. చూడబోతుంటే… ఆడియో విడుదలకు ముందు నుండే ఈ సారి పవన్ మేనియా ప్రారంభమైనట్లు కనపడుతోంది.