Pawan Kalyan safe game with Telangana Inter resultsతెలంగాణాలో ఇంటర్మీడియట్ బోర్డు చేసిన తప్పులకు పిల్లలు, వారి తల్లితండ్రులు రోడ్డున పడ్డారు. ఇప్పటివరకు 18 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు అయినా ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టు కూడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో చీమ చిత్తుకుమన్న హడివిడి చేసే సినీ నటులు దీని మీద స్పందించకపోవడం, స్పందించినా నేరం పిల్లల మీద ఒత్తిడి పెడుతున్నారంటూ అసలు విషయాన్నీ వదిలేసి తల్లితండ్రులను నిందించడంతో ఈ విషయం వివాదాస్పదం అయ్యింది.

“తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చడం దారుణం. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు. ఇంటర్ ఫలితాలు ప్రకటించాక 17మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి.. పరీక్ష ఫీజు చెల్లింపు, పేపర్ వాల్యుయేషన్ నుంచి ఫలితాల వెల్లడి వరకూ ప్రతి దశపైనా విద్యార్థుల్లోనూ.. వారి తల్లిదండ్రుల్లో అనేక సందేహాలు ఉన్నాయి” అని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

“విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసి.. నిజాలు వెల్లడించాలి. సందేహాలు వ్యక్తం చేస్తున్న విద్యార్థులు.. వారి తల్లిదండ్రులపై ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఎదురుదాడి చేసే విధంగా మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. విద్యార్థులకు ఉచితంగా రీ వాల్యుయేషన్, రీ వెరిఫికేషన్ చేయాలి,” అని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ పై విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ ఎన్నికల తరువాత తెలంగాణ ముఖ్యమంత్రితో అనవసర వైరం ఎందుకు అనుకున్నారేమో. దీనితో మీడియా ముందుకు రాకుండా పత్రిక ప్రకటన ఇచ్చి సరిపెట్టారు.