Pawan Kalyanఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావదినోత్సవ సభ జరుగబోతోంది. కనుక ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నేడు హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం చేరుకొన్నారు. ఆర్మీ డ్రెస్సులో స్టైల్‌గా వచ్చిన ఆయనను చూసి అభిమానులు సంతోషంతో ఈలలు వేశారు. వారు వెంటరాగా పవన్‌ కళ్యాణ్‌ విమానాశ్రయం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి బయలుదేరారు.

పవన్‌ కళ్యాణ్‌ సినిమాల కోసం ఎన్ని వేషాలు వేసుకొన్నా అవి అవసరమే గాబట్టి ఎవరూ వేలెత్తి చూపలేరు. కానీ రాజకీయ కార్యక్రమాలకు వచ్చినప్పుడు అందుకు తగ్గ దుస్తులు ధరించి వస్తే బాగుంటుంది. రాష్ట్రంలో జనసేన అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కావాలని భావిస్తున్న పవన్‌ కళ్యాణ్‌, అందుకు తగిన దుస్తులతో హుందాగా కనిపించాలి కానీ రకరకాల వేషాలతో ప్రజల మద్యకు వస్తే ‘రాజకీయాల పట్ల సీరియస్‌నెస్ లేదనే’ తప్పుడు సంకేతాలు పంపిన్నట్లవుతుందని గ్రహిస్తే మంచిది.

ఇప్పటికే పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడని పవన్‌ కళ్యాణ్‌ను వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తుంటారు. ఇలా వచ్చినప్పుడు కూడా సినిమా వేషంలోనే కనిపిస్తే విమర్శలకు మరింత అవకాశం కల్పించిన్నట్లవుతుంది కదా? పవన్‌ కళ్యాణ్‌ సినిమా ఇమేజ్‌ జనసేనకు చాలా అవసరం కావచ్చు కానీ ప్రజలకు కాదు!

ఓ రాజకీయ నాయకుడుని ఏవిదంగా చూడాలనుకొంటారో ఆవిదంగానే కనిపిస్తే హర్షిస్తారు లేకుంటే తప్పుగా భావిస్తారు. తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌, కల్వకుంట్ల కవితని ఉద్దేశ్యించి “ఈడీ అరెస్ట్ చేయకపోతే ముద్దు పెట్టుకొంటుందా?” అని చిన్న మాట జారినందుకు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలు దగ్ధం అవుతున్నాయి. కనుక రాజకీయాలలో ఓ చిన్న మాట, భాష, యాస, వ్యవహారశైలి, వేషధారణ ప్రతీది చాలా ముఖ్యమే అని పవన్‌ కళ్యాణ్‌ గ్రహిస్తే జనసేనకే మంచిది.

ఈరోజు మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కార్యాలయంలో బీసీ సంక్షేమంపై జరిగిన రౌండ్ టేబిల్ సమావేశంలో పవన్‌ కళ్యాణ్‌ పాల్గొన్నారు. రేపు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. మార్చి 13వ తేదీన మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావదినోత్సవ సభ, అజెండాపై చర్చిస్తారు. ఆరోజు సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ ఎస్.అబ్దుల్ నజీర్‌ను మర్యాదపూర్వకంగా కలుస్తారు.

మార్చి 14వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి ఆటోనగర్, తాడిగడప జంక్షన్, పోరంకి జంక్షన్, పెనమలూరు జంక్షన్, పామర్రు-గుడివాడ సెంటర్, గూడూరు సెంటర్ మీదుగా తన వారాహి వాహనంలో ఊరేగింపుగా మచిలీపట్నంలోని సభావేదిక వద్దకు చేరుకొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జనసేన ఆవిర్భావదినోత్సవ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.