Pawan Kalyan - Review on Jagan 100 days ruleజనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జగన్ 100 రోజుల పాలన పై జనసేన నివేదికను విడుదల చేశారు. 100 రోజుల పాలనపై 9 అంశాలకు సంబంధించి 33 పేజీలను నివేదిక విడుదల చేసి… ఇప్పటివరకు కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలం అయ్యిందని తేల్చారు. మేనిఫెస్టో జనహితంగా ఉంది.. కానీ, పాలనే అందుకు విరుద్ధంగా ఉందని పవన్‌ అభిప్రాయపడ్డారు. పారదర్శకత, దార్శనికత లోపించినట్లు తమ నివేదికలో తేల్చారు.

ఇసుక విధానం, పెట్టుబడులు ఆకర్షించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని జనసేన విమర్శించింది. ప్రజారోగ్యం పడకేసిందని, పోలవరం నిలిచిపోయిందని ఆరోపించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా జనసేన పార్టీ పెదవి విరిచింది. వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయడం కోసం అధికార పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా తీసుకొచ్చారు. టీడీపీను జన్మభూమి కమిటీలు దెబ్బతీసినట్లే.. వైకాపాను వాలంటీర్ల వ్యవస్థ దెబ్బతీస్తుంది’ అని పవన్‌ అభిప్రాయపడ్డారు.

మలేరియా వంటి సీజనల్‌ వ్యాధుల నివారణలో సన్నద్ధత లోపించిందని అందులో పేర్కొన్నారు. ఇసుక విధానం, పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైనట్లు, శాంతి భద్రతలు క్షీణించినట్లు జనసేన తన నివేదికలో చెప్పుకొచ్చింది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన లేదని, ప్రజారోగ్యం పడకేసిందని, ప్రభుత్వ చర్యల కారణంగానే పోలవరం నిలిచిపోయిందని నివేదిక వెల్లడించింది. జనసేన విడుదల చేసిన ఈ నివేదికపై అధికార పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.